ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీ పురుషుల జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఏ మాత్రం అంచనాలు .. ఆశల్లేకుండా బరిలోకి దిగిన హాకీ జట్టు సంచలన విజయాలతో సెమీస్‌కు చేరి అక్కడ పరాజయం పాలైంది. అయితే కాంస్య పతకం సాధించే అవకాశం ఉండటంతో ప్రధాని మోడీ సహా అందరూ.. ఉత్సాహపరిచారు. అందరి ఆశలను మోసుకెళ్లిన భారత హాకీ టీం.. కాంస్య పతకాన్ని సాధించుకొచ్చింది. తమ కంటే ఎంతో బలమైన జర్మనీ జట్టును 5-4 తేడాతో ఓడించి…భారత ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో దేశంలో పండుగ వాతావరణం ఏర్పడింది. హాకీ బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
భారత హాకీ సాధించింది కాంస్యమే అయినా.. ఇంత పెద్ద ఎత్తున ప్రశంసలు రావడానికి కారణం ఉంది. అదే హాకీ ఘన చరిత్ర. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో భారత్‌కు తిరుగులేని గేమ్ హాకీ. 1928 ఒలింపిక్స్ నుంచి 1980 వరకు ఒలింపిక్స్ హాకీ విభాగంలో స్వర్ణ పతకం భారత జట్టుదే. 1928, 32, 36, 48, 52, 56, 60, 64, 68, 72 లలో జరిగిన ఒలింపిక్స్‌తోపాటు 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లోనూ హాకీ స్వర్ణ పతకం భారత్‌దే. అయితే ఆ తర్వతా భారత హాకీ వైభవం మసక బారింది. దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ విజయాల బాటలో వెనుకబడింది. అదే సమయంలో క్రికెట్ విజృంభణ ప్రారంభం కావడంతో హాకీ మెల్లగా వెనుకబడి పోయింది.
చాలా ఏళ్ల తరవాత భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ చూపి సెమీస్ వరకూ చేరుకున్నాయి. సెమీస్‌లో ఓడినప్పటికీ.. పురుషుల జట్టు కాంస్యం సాధించింది. ఇక బాధ్యత మహిళల జట్టుపై ఉంది. గతమెంతో ఘనకీర్తి ఉండటంతో… పాత రోజులను మళ్లీ తీసుకు వస్తున్నారన్న ఉద్దేశంతో దేశ ప్రజలంతా… హాకీ టీంకు జేజేలు పలుకుతున్నారు.