సంక్రాంతి తరవాత తెలుగు సినిమాలకు సరైన హిట్ పడలేదు. ఈ వేసవిలోనూ భారీ చిత్రాలు లేవు. దానికి తోడు… ఎన్నికల సీజన్. దాంతో బాక్సాఫీసు దగ్గర సందడి ఉండదేమో అని బెంగ పడిపోయారంతా. అయితే రెండు కామెడీ సినిమాలు ఆ బెంగ కాస్త తీర్చేశాయి. గత వారం ‘ఓం బీం బుష్’ మంచి విజయాన్ని అందుకొంటే, ఈవారం ‘టిల్లు స్క్వేర్’ ఆ బాధ్యత తీసుకొంది. రెండూ వినోద ప్రధానంగా సాగే కథలే. పరిమిత బడ్జెట్ లో రూపొందాయి. ‘ఓం బీం భుష్’ శ్రీవిష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లని అందుకొంటే, `డీజే టిల్లు` వసూళ్లని టిల్లు స్క్వేర్ అధిగమిస్తుందన్న నమ్మకం తొలి రోజు వసూళ్లు ఇచ్చేశాయి. ఈ సినిమా వంద కోట్లు సాధిస్తుందని నిర్మాత బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. వంద కోట్ల మాటలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ, ఈ సినిమాతో సిద్దు జొన్నల గడ్డ రేంజ్ మరింత పెరిగిన మాట వాస్తవం.
ఈ విజయాలు కామెడీ కథలకు ఆదరణ తగ్గలేదన్న విషయాన్ని మరోసారి నిరూపించాయి. అయితే.. వినోదం పండించడంలో ఈ రెండు సినిమాలూ వేర్వేరు పంధాల్ని అనుసరించాయి. ‘ఓం బీం బుష్’లో కామెడీ ఓ కొత్త ఒరవడిలో సాగింది. సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్లకు కనెక్ట్ అయ్యేలా మాటలు రాసుకొన్నారు. ‘టిల్లు స్క్వేర్’ది మరో దారి. సెట్యువేషనల్ కామెడీ కాకుండా.. డైలాగుల ద్వారా పుట్టే వినోదానికే పెద్ద పీట వేశారు. మొత్తానికి ప్రేక్షకుల్ని నవ్వించారు. అలా.. రెండు చిత్రాలకూ విజయాలు దక్కాయి. మరో విశేషం ఏమిటంటే… ‘ఓం బీం బుష్’కి సీక్వెల్ కి రంగం సిద్ధం అవుతోంది. ‘టిల్లు స్క్వేర్’కి మూడో భాగం ఉంటుందని నిర్మాత చెప్పేశారు. సో… ఈ వినోదాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంటుందన్నమాట.