Om Bheem Bush review
తెలుగు360 రేటింగ్ : 2.75/5
-అన్వర్
కామెడీకి కనెక్ట్ అయినంత ఈజీగా ఆడియన్స్ దేనికీ కనెక్ట్ కారేమో! నవ్విస్తూ ఏ కథ చెప్పినా ‘ఊ’ కొట్టేస్తారు. అందులో లాజిక్కులు లేకపోయినా పెద్ద మనసుతో క్షమించేస్తారు. అందుకే కామెడీ కథలు కలకాలం మనగలుగుతున్నాయి. చిన్న హీరోలకు ఎంటర్టైనర్లు శ్రీరామ రక్ష. ఎందుకంటే వాళ్లతో భారీ బడ్జెట్ సినిమాలు చేయలేరు. ప్రయోగాల జోలికి వెళ్లి రిస్క్ చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో కామెడీ కథలు ఆదుకొంటుంటాయి. గతేడాది ‘సామజవరగమన’తో మంచి హిట్టు కొట్టాడు శ్రీవిష్ణు. అది… హిలేరియస్ ఎంటర్టైనర్. అందుకే మరోసారి కామెడీని నమ్ముకొని ‘ఓం భీమ్ బుష్’ చేశాడు. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ ఆకట్టుకొని, ప్రమోషన్ పరంగానూ హీట్ పెంచిన సినిమా ఇది. మరి శ్రీవిష్ణు నమ్ముకొన్న కామెడీ ఈసారి కూడా వర్కవుట్ అయ్యిందా? లేదా?
ఇది ముగ్గురు స్నేహితుల (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) కథ. ముగ్గురూ తుంటరోళ్లే. ఓ ప్రొఫెసర్ (శ్రీకాంత్ అయ్యంగార్) పొగడ్తలతో మునగచెట్టు ఎక్కించి, ఆయన దగ్గర పీహెచ్‌డీలో శిష్యరికం చేస్తారు. వీళ్ల అరాచకాలతో విసిగి వేసారిపోయిన ఆ ప్రొఫెసర్, ఈ ముగ్గురి థీసెస్ తానే రాసేసి, డాక్టరేట్ పట్టా కూడా ఇచ్చేసి మర్యాదగా అక్కడ్నుంచి తరిమేస్తాడు. వెళ్తూ వెళ్తూ ఓ ఊర్లో ఆగుతారు. ఆ ఊరు లంకెబిందెలు, ఆత్మలూ, మూఢ నమ్మకాలతో వర్థిల్లుతుంటుంది. వాళ్ల బలహీనతల్ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అక్కడే తిష్ట వేస్తారు. సైన్స్ ని ఆసరాగా చేసుకొని ఆత్మల్ని పట్టిస్తాం, లంకె బిందెల్ని తవ్విస్తాం అంటూ అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అదే ఊర్లోని పాడుపడ్డ ఇంట్లో సంపంగి అనే ఆత్మ కూడా ఉంటుంది. ఆఖరికి దాన్ని కూడా పట్టుకొని, ఆ ఇంట్లో ఉన్న గుప్త నిధుల్ని బయటకు తీసుకొస్తాం అని ఊర్లోవాళ్లతో ఛాలెంజ్ చేస్తారు. మరి ఈ సవాల్ ఏమైంది? నిజంగానే ఆ ఊర్లో గుప్త నిధులు ఉన్నాయా, సంపంగి ఆత్మ సంగతేంటి? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
అసలే ఇది కామెడీ కథ. దానికి తోడు ‘నో లాజిక్ ప్లీజ్’ అంటూ ముందరే ముందర కాళ్లకు బంధమేశారు. కాబట్టి లాజిక్ అనే పదాన్ని థియేటర్ గుమ్మం ముందే వదిలేసి, లోపలకు అడుగు పెడితే మంచిది. అప్పుడే అసలైన కామెడీ విందు ఆస్వాదించొచ్చు. కామెడీలో చాలా రకాలున్నాయి. ఈ సినిమా మరో రకం. డైలాగులు, కొన్ని చోట్ల అర్థం పర్థం లేని మాటలు, చేష్టలు, చూపులతో నవ్వులు పండించే ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ ఎపిసోడ్ నుంచే ఈ ముగ్గురు మిత్రుల అరాచకం మొదలైపోతుంది. ఆ ప్రొఫెసర్ని పెట్టిన తిప్పలు నవ్వులు పూయిస్తాయి. ఆ తరవాత ఊర్లోకి అడుగు పెట్టడం, వెరైటీ గెటప్పులతో, మ్యాజిక్కులతో దెయ్యాల్ని తరిమేసే ప్రయత్నం చేయడం, పూజారికి ఇచ్చిన షాకులు, మగతనాన్ని తట్టి ‘లేపడానికి’ చేసిన ప్రయత్నాలు ఒకదాని తరవాత మరోటి నవ్విస్తూనే ఉంటాయి. సిట్యువేషన్ కామెడీ అంటారే. ఇక్కడ కూడా సిట్యువేషన్లే కామెడీ పండిస్తాయి. అయితే సన్నివేశం నుంచి పుట్టే కామెడీ కంటే, ఆయా సంభాషణల్లో ఉండే మెరుపులే చాలా సన్నివేశాల్ని నిలబెట్టాయి. తిట్లని కొత్త తరహాలో వాడడం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డైలాగుల్ని, మీమ్స్ కంటెంట్ ని పట్టుకోవడం.. బాగా కలిసొచ్చింది. వేణు స్వామి, బిగ్ బాస్, మొగలి రేకులులో సీరియల్ లో ఆర్కే నాయుడు.. ఇలాంటి డైలాగులతో సోషల్ మీడియాతో టచ్‌లో ఉండేవాళ్లు పడీ పడీ నవ్వుతారు. కొన్ని అడల్ట్ జోకులూ ఉన్నాయి. కాకపోతే వాటినీ వీలైనంత పాష్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని డైలాగులు అప్పటికప్పుడు అర్థం కావు. అర్థమయ్యాక.. ‘ఓహో.. ఈ ఉద్దేశ్యంతో ఈ డైలాగ్ వాడాడా’ అనిపిస్తుంది. తొలి సగంలో కథేం ఉండదు. కామెడీ సన్నివేశాలు తప్ప. అవి దాదాపుగా వర్కవుట్ అయ్యాయి.
సంపంగి ఉన్న మహల్ లో ఈ మిత్ర త్రయం అడుగు పెట్టడం దగ్గర్నుంచి సెకండాఫ్ మొదలవుతుంది. అక్కడే అసలు కథ కూడా దాగుంది. అసలు సంపంగి ఎవరు, తన కథేమిటి? అని తెలుసుకోవాలన్న ఆత్రుత మొదలవుతుంది. దెయ్యం ఎపిసోడ్లతో హారర్ ఎలిమెంట్ కావల్సినంత సృష్టించొచ్చు. అయితే అక్కడ కూడా.. దర్శకుడు వినోదాన్ని పండించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. సంపంగి తన కథ తాను చెప్పుకొనేంత వరకూ ఈ సినిమా కామెడీ పంథాలోనే సాగుతుంది. ఆ తరవాత సంపంగి కథ మొదలవ్వడంతో కాస్త ఎమోషన్ యాడ్ అవుతుంది. ‘గే’ లవ్ స్టోరీ చాలామందికి ఎక్కకపోవొచ్చు. పైగా.. ఎప్పుడైతే దెయ్యం హీరోతో లవ్ లో పడిపోతుందో అక్కడ హారర్‌తో పాటు, కామెడీ కూడా మిస్ అవుతుంది. క్లైమాక్స్ చాలా సాదా సీదాగా ఉంది. అప్పటి వరకూ ఈ సినిమా తీసిన, రాసిన దర్శకుడే.. క్లైమాక్స్ కూడా డిజైన్ చేశాడా అనిపిస్తుంది. క్లైమాక్స్ కట్టుదిట్టంగా రాసుకోవడమో, అక్కడ కూడా ఫన్ సృష్టించడమో చేసి ఉంటే, ‘ఓం భీమ్ బుష్’ రేంజ్ మరోలా ఉండేది. చివర్లో ఏదో సందేశం చేరవేయాలన్న తాపత్రయంలో దర్శకుడు లాజిక్‌తో పాటు కామెడీని కూడా వదిలేశాడు.
శ్రీవిష్ణు ప్రామిసింగ్ నటుడు. తన కామెడీలో ఈజ్ ఉంటుంది. ఈ సినిమాలో తనదైన శైలి లో కామెడీ పండించాడు. ఈసారి డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా అనిపించింది. కొన్ని డైలాగులు తన బాడీ లాంగ్వేజ్ వల్ల, పలికే విధానం వల్ల ఫన్ సృష్టించాయి. తన సినిమాలో తనే కనిపించాలన్న తాపత్రయం పక్కన పెట్టి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు కూడా సమానమైన చోటిచ్చాడు. ఈ ముగ్గురి స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ల కెమిస్ట్రీ ఈ సినిమాకు బలం. కొన్ని సన్నివేశాలు దర్శకుడి రచనా నైపుణ్యం వల్ల పేలితే, ఇంకొన్ని ఈ ముగ్గురి కామెడీ టైమింగ్ వల్ల గట్టెక్కాయి. హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యం లేదు. బలమైన విలన్ కూడా కనిపించడు.
ఇలాంటి కథని చెబితే… అర్థం చేసుకోవడం కష్టం. దర్శకుడి విజువలైజేషన్, తన రైటింగ్ స్కిల్స్ ని నమ్మి పని అప్పగించడమే. శ్రీవిష్ణు అదే చేశాడు. ఆ నమ్మకాన్ని హర్ష నిలబెట్టుకొన్నాడు కూడా. అసలు కథలో కొత్త విషయం ఏమీ లేకపోయినా… సీన్లతో ఈ సినిమాని నడిపించేశాడు. కామెడీలో ట్రజర్ హంట్ నీ, హారర్ ఎలిమెంట్ నీ మిక్స్ చేసి ఓ సరికొత్త జోనర్‌ని పరిచయం చేశాడు. నిజానికి ఈ కథ ఓ జోనర్‌కి లొంగదు. అన్ని రకాలూ టచ్ అయినట్టే. క్లైమాక్స్ ఎందుకో హడావుడి పడిపోయారు. ఆ విభాగంపై కసరత్తు చేయాల్సిందే. పాటలు మళ్లీ మళ్లీ వినేలా లేవు కానీ, స్టైలీష్‌గా ఉన్నాయి. కొన్ని చోట్ల మాటలు భలే కుదిరాయి. ఇంగ్లీష్ మాటల్ని రాంగ్ ప్లేస్‌లో వాడడం ఈ సినిమా సంభాషణల్లో కొత్త మెరుపుని తీసుకొచ్చింది. తమ సినిమాపై తామే సెటైర్లు వేసుకొనే పద్ధతి కూడా బాగుంది. ఓ చోట.. హీరో హీరోయిన్‌తో ‘అసలు ఇక్కడ ఓ పాటేసుకోవాలి. కానీ.. నా లాస్ట్ సినిమాలో పాటలు అంతగా వర్కవుట్ కాలేదు. అందుకే పాటొద్దు’ అంటాడు. ఎంత మంచి సెటైర్ ఇది?! ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడంటూ ప్రచార కార్యక్రమాల్లో కవరింగు ఇచ్చి, హైప్ తీసుకొద్దామనుకొంది చిత్రబృందం. ప్రభాస్ లేకపోయినా ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘రాధేశ్యామ్’, ‘సలార్’ సినిమాల్ని గుర్తు చేసే కొన్ని డైలాగులు ఉన్నాయి. అవి ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చుతాయి. మొత్తానికి లాజిక్లను పక్కన పెట్టి, కాసేపు సరదాగా నవ్వుకోవాలనుకొనేవారికి ‘ఓం భీమ్ బుష్’ ఓ మంచి ఆప్షన్.
తెలుగు360 రేటింగ్ : 2.75/5
-అన్వర్