ఓం నమో వేంకటేశాయ దర్శకేంద్రుడి కెరీర్లో ఆఖరి చిత్రమా? ఈ ప్రశ్నని చాలా రోజుల క్రిందే తెలుగు 360. కామ్ లేవనెత్తింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాతో రిటైర్మైంట్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని, ఆ తరవాత దేవుడి సేవలో తరించాలని భావిస్తున్నారని తెలుగు 360 ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు ఆ మాటే నిజం అవ్వబోతోంది. దర్శకేంద్రుడు ఓం నమో వేంకటేశాయతో తన కెరీర్‌కి పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని నాగార్జున కూడా ఓం నమో వేంకటేశాయ ఆడియో వేడుకలో చెప్పేశాడు. ”ఈ సినిమానా చివరి సినిమా అవుతుందని రాఘవేంద్రరావుగారు నాతో చెప్పేవారు. ఆ మాట నిజం కాకూడదని కోరుకొంటున్నా” అంటూ రాఘవేంద్రరావు రిటైర్మెంట్ విషయాన్ని లీక్ చేసేశాడు.
వంద సినిమాలు పూర్తయిన తరవాత… దర్శకేంద్రుడు స్పీడు తగ్గించేశాడు. కేవలం ఆధ్యాత్మిక, భక్తిభావ చిత్రాల్ని మాత్రమే రూపొందిస్తున్నారు. ఇక పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలన్న నిర్ణయానికి రాఘవేంద్రరావు ఎప్పుడో వచ్చేశారని తెలుస్తోంది. అయితే వేంకటేశ్వరస్వామికి కానుకగా ఓ సినిమా తీయాలని, ఆ తరవాతే తన రిటైర్మెంట్ ప్రకటించాలని ఎదురుచూశారు. ఆ అవకాశం ఓం నమో వేంకటేశాయతో వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు దర్శకేంద్రుడు తన మనసులోని మాట బయటపెట్టే అవకాశం ఉంది. రిటైర్మెంట్ తరవాత ఆయన కొన్ని ధారవాహికల్ని రూపొందిస్తారని తెలుస్తోంది. అదీ… టీటీడీ ఛానల్ కోసం.