నంద్యాల, కాకినాడ ఓటమి తరువాత ప్రతిపక్ష పార్టీ వైకాపా వెంటనే వేర్వేరు కార్యక్రమాలకు దిగేసింది. ప్రస్తుతం వైయస్సార్ ఫ్యామిలీ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని వైయస్సార్ అభిమానులను ఏకీకృతం చేయడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లబ్ధి పొందినవారిని గుర్తించడం, జగన్ అభిమానులను గుర్తించడం, ఆ జాబితాను సిద్ధం చేయడం అనే లక్ష్యాలతో వైకాపా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఓరకంగా వైయస్సార్ అభిమానులను గుర్తించడం అంటే, వైకాపా ఓటు బ్యాంకును తయారు చేసుకోవడమే. ఈ కార్యక్రమం అమలు వెనక రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ (పీకే) సూచనలు లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి! పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది కాబట్టి, ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పీకే ఇంతకుముందే చెప్పినట్టు కథనాలు వినిపించాయి.
అయితే, ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఎలా నిర్వహిస్తున్నారు అనేదానిపై కూడా పీకే ఓ కన్నేసి ఉంచినట్టు సమాచారం. నియోజక వర్గాల్లో నాయకులు, కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారు..? నాయకులు ఎవరిని కలుస్తున్నారు..? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు..? వారి వ్యవహార శైలి ఎలా ఉంటోంది..? ఇలాంటి అంశాలన్నింటిపైనా ఆరా తీసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని పీకే ఏర్పాటు చేశారనీ, వారు ఎప్పటికప్పుడు తమ నివేదికల్ని ఆయనకి పంపుతున్నారనే చర్చ వైకాపా వర్గాల్లో జరుగుతోంది. ప్రతీ నియోజక వర్గంలో పార్టీ నేతల తీరును గమనించేందుకు ఏజెంట్లను పీకీ ఏర్పాటు చేశారట. వీరు ఈ ఒక్క వైయస్సార్ ఫ్యామిలీ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కారనీ, వచ్చే ఎన్నికల వరకూ క్షేత్రస్థాయిలోనే ఉంటారనీ, పార్టీకి సంబంధించిన కీలక సమాచారం అందిస్తూ ఉంటారని వైయస్సార్ సీపీ వర్గాల్లో వినిపిస్తోంది. నాయకుల పనితీరుపై వీరు ఇచ్చే నివేదికల్ని జగన్ కు పీకే అందిస్తున్నారని సమాచారం.
ఈ ఏజెంట్ల ఏర్పాటు తెలిసిన దగ్గర నుంచీ కొంతమంది సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురౌతున్నట్టు చెబుతున్నారు. పార్టీలో తాము ఎప్పట్నుంచో ఉన్నామనీ, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి జగన్ వెంట ఉంటున్నామనీ, తమ పనితీరుపైనే అనుమానమా అంటూ వాపోతున్నారట! ఇలా రహస్యంగా తమపై నిఘా పెట్టించాల్సిన అవసరం ఏముందనీ, ఇది తమ చిత్తశుద్ధిని అవమానించినట్టుగానే ఉంటోందని ఆఫ్ ద రికార్డ్ వాపోతున్నారట. పార్టీ కోసం పనిచేయడానికి వచ్చిన పీకే ఆలోచనలు పిచ్చిగా ఉంటున్నాయనీ, కార్యకర్తలూ నాయకులపైనే నిఘా పెట్టిస్తే ఎవరికైనా ఎలా ఉంటుందనీ తీవ్ర స్వరంతోనే పీకేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి అనుభవం తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని కొంతమంది మదనపడుతున్నట్టు సమాచారం. అంతేకాదు, వైయస్ ఫ్యామిలీలోకి స్వచ్ఛందంగా వచ్చేవారి వల్ల ఉపయోగం ఉంటుందనీ, బలవంతంగా ప్రజల్ని చేర్పించినా వారు ఓటు వేస్తారన్న నమ్మకం ఎక్కడ ఉంటుందని ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేత వాపోతున్నారట. నేతలతోపాటు కార్యకర్తల పనితీరుపై నిఘా పెట్టించడం సరికాదని అంటున్నారట! మొత్తానికి, ఈ రహస్య నివేదికలు వైకాపాలో చిచ్చురేపేలానే ఉంది.