రెండు వారాల వ్యవధిలోనే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మరోసారి బెంగళూరుకు వెళ్తున్నారు. జూన్ 24నే బెంగళూరు వెళ్ళిన ఆయన.. జులై 1వరకు అక్కడే ఉండి వచ్చారు. ఇప్పుడు మళ్లీ బెంగళూరుకు వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఈ వరుస పర్యటనల మర్మం ఏంటనే చర్చ జరుగుతోంది.
మొదట సోమవారం నుంచి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాలని జగన్ ప్లాన్ చేసుకున్నారు. పార్టీ నాయకులను, ప్రజలని కలిసేందు కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ, సడెన్ గా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని జగన్ బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ దాడి తీవ్రతరం చేసిన వేళ ఆయన బెంగళూరు ట్రిప్ బిగ్ డిబేట్ గా మారింది.
మరోవైపు.. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ హాజరు అవుతారా..? లేదా…? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. సోమవారం బెంగళూరుకు వెళ్తున్న జగన్ వారం రోజులపాటు అక్కడే ఉంటారని అంటున్నా.. వచ్చే వారం నాటికీ రాష్ట్రానికి వచ్చి అసెంబ్లీకి వెళ్తారా..? లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
శాసన సభ సమావేశాల వేళ జగన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటే మాత్రం అది విమర్శలకు తావిస్తుంది. కాబట్టి ఆయన వారం రోజులకు తిరిగి వస్తారని, కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై పార్టీ నేతలతో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.