రాజును మించి రాజభక్తి ప్రదర్శించే వాళ్ల గురించి ఎలాంటి వాక్యాలతో విమర్శించినా అసహ్యమే. అది మీడియాలో ఉన్న వారి గురించి అయితే.. చెప్పాల్సిన పని లేదు. టీవీ9 ఆ స్థాయికి దిగజారిపోతోంది. ఎప్పటికప్పుడు ప్రజాదరణ కోల్పోతున్నా…రాజును మించి రాజభక్తిని ప్రదర్శిస్తోంది. తప్పుడు ప్రచారాలతో.. ఏపీ అధికార పార్టీకి మేలు చేయడానికి .. విపక్షాలపై కుట్రలు చేయడానికి ఈ టీవీ చానల్ ను అంకితం చేశారు. తాజాగా దీనికి సంబంధించి ఆ టీవీ చానల్ చేసిన వ్యవహారం .. ఆ చానల్ ను… జర్నలిస్టులను కూడా అసహ్యించుకునేలా చేసింది.
పుంగనూరులో ఏం జరిగిందో కళ్లున్న కబోధిలా చెప్పడం ఎప్పుడో మర్చిపోయింది. అది రాజు భక్తి అనుకున్నా.. తాజాగా ఆ ఘటనల్లో నాలుగు రోజుల తర్వాత చంద్రబాబుతో పాటు మరికొందరిపై హత్యాయత్నం వంటి కేసులు నమోదు చేశారు. ఇలా కేసులు నమోదు చేయగానే అలా.. పరారీ అనే బ్రేకింగ్‌లు ప్రారంభించింది టీవీ9. దేవినేని ఉమ ఈ కేసుల్లో ఏ 2 గా నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నాడని బ్రేకింగ్‌లు వేశారు. నిజానికి అప్పుడు ఉమ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇతర చానల్స్ లో వస్తోంది. తర్వాత టీవీ9తో కూడా మాట్లాడి రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు.
ఇంత శుకనానందం టీవీ9కి ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పుంగనూరులో ఏంజరిగిందో… జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నచంద్రబాబుపై రాళ్లు పడ్డాయో లేదో చూపించలేని దౌర్భాగ్య జర్నలిజానికి దిగజారిపోయిందిక కాక.. బయట కళ్ల ముందు తిరుగుతున్నవారిని పరారీ అంటూ తప్పుడు ప్ర చారం చేయడం ఆ చానల్ పరువును మరింతగా తీసింది. గతంలో హైకోర్టు తీర్పునే ముందుగా ప్రకటించారు. ఎందుకైనా మంచిది ఇక.. టీవీ9 ముందు హాజరు వేయించుకోవడమో.. లొంగిపోవడమో చేయాలని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.