హైదరాబాద్: పాయకాపురం ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు అనిత వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కోటి రూపాయలకు పరువునష్టం దావా వేయబోతున్నారు. అనిత ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పటికే నోటీస్ పంపానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రోజా తన గురించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు బయటకొచ్చిన నేపథ్యంలో ఈ దావా వేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రోజా తీవ్రవాదులకన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు తనను కలచివేశాయని అన్నారు. రోజా మితిమీరి ప్రవర్తిస్తున్నా జగన్ ఎందుకు వారించటం లేదని ప్రశ్నించారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో తన నియోజకవర్గం పరిధిలో ఇటీవల జరిగిన దక్కన్ కెమికల్స్ అగ్నిప్రమాదం తీవ్రమైనదని చెప్పారు. అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని అన్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని గ్రామాల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. ఫ్యాక్టరీ మూసేయాలి లేదా వేరేచోటకు తరలించాలని గ్రామాల వాసులు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదేనని అనిత అన్నారు. స్థానికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.
రోజా గత అసెంబ్లీ సమావేశాలలో అనితనుద్దేశించి మాట్లాడుతూ, తాను ఆమెలాగా ఎవరితోపడితే వారితో పడుకోలేదని, మొగుడిని కొట్టి పోలీస్ స్టేషన్కు వెళ్ళలేదని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల కారణంగానే ఆమెను ఏడాదిపాటు అసెంబ్లీనుంచి సస్పెండ్ చేశారు.