రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం తీరుకి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక రోజు నిరాహార దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో జరిగిన శాఖమూరులో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల 20న తన జన్మదినం అనీ, అదే రోజున నిరాహార దీక్ష చేయబోతున్నానని ప్రకటించారు. ఆ తరువాత, ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ పెడుతున్నట్టు తెలిపారు. నాలుగేళ్ల కిందట ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ తిరుపతి వచ్చారనీ, ఏడుకొండలవాడి సాక్షిగా మనకు హామీ ఇచ్చారనీ, కానీ, దాన్ని అమలు చేసే పరిస్థితి ఇప్పటివరకూ లేదన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లాలూచీ రాజకీయం చేస్తోందన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, ఉన్నవి చాలదన్నట్టుగా బంద్ పిలుపునిచ్చారన్నారు. కేంద్రం అన్యాయం చేసిందనీ, వారి ఆలోచనకు అనుగుణంగా ప్రతిపక్షాలూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే చివరికి నష్టపోయేది ఎవరని ప్రశ్నించారు. ఇక్కడ (ఆంధ్రాలో) భాజపా లేదనీ, ఒక్క ఓటు కూడా పడే పరిస్థితి ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపించాలనీ, భవిష్యత్తులో ఢిల్లీని శాసించేది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ… రాష్ట్రంలో అదిచేస్తా ఇదిచేస్తా అని తిరుగుతున్నారనీ, ఇంతవరకూ చేసిన అనుభవం ఏదని ప్రశ్నించారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లి, చేతులు కట్టుకుని బోన్లో నిలబడి, బయటకి వచ్చి తనను విమర్శించడమేనా విశ్వసనీయత అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు రేప్పొద్దున్న కేంద్రానికి భయపడరా అన్నారు. ఇలాంటివారు వారి కేసుల్ని మాత్రమే చూసుకుంటారనీ, అందుకే అప్పట్లో కాంగ్రెస్ తో లాలూచీ పడ్డారనీ, ఇప్పుడు భాజపాతో అలాంటి రాజకీయాలే చేస్తున్నారు అన్నారు. కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తాననీ, దానికి ప్రజల సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు.
మొత్తానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ప్రజల మద్దతు అవసరమని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతుందనీ, ఢిల్లీ శాసించే స్థాయిలో ఉంటామని చెప్పడం కూడా విశేషమే. పనిలోపనిగా వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొనే ప్రచార వ్యూహాన్ని కూడా దాదాపుగా చెప్పినట్టే..! వారానికోసారి కోర్టులకు వెళ్లేవారు, కేంద్రంతో లాలూచీ పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేసే పరిస్థితి ఎక్కడ ఉంటుందనే ప్రశ్నను లేవనెత్తారని చెప్పొచ్చు.