హైదరాబాద్: బ్రిటన్ ప్రభుత్వ వీసా అండ్ ఇమ్మిగ్రేషన్ విభాగంవారి సేమ్ డే సూపర్ ప్రయారిటీ వీసా(ఎస్పీవీ) పథకం బ్రహ్మాండంగా హిట్ అయి కూర్చుంది. ఇండియాలోని వ్యాపార వర్గాలు ఈ వీసాను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయని బ్రిటన్ వీసా అండ్ ఇమ్మిగ్రేషన్ విభాగం స్థానిక అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే ఇలాంటి పథకాన్ని భారత్లోనే మొదటిసారి ప్రవేశపెట్టామని తెలిపారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరన్ 2013లో తన భారత పర్యటనలో ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదట ఢిల్లీ, ముంబాయి నగరాలలో తర్వాత చెన్నైలో ప్రవేశపెట్టారు. భారత్ తర్వాత చైనా, బ్రెజిల్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా దేశాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు 1,300 మంది భారతీయులు ఉపయోగించుకున్నారని అధికారులు వెల్లడించారు. సాధారణంగా వీసాకు అయ్యే ఖర్చులకు అదనంగా రు.60,000 కట్టించుకుని దరఖాస్తు చేసిన రోజే వీసా మంజూరు చేస్తున్నామని తెలిపారు.