తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంపై ఫోకస్ పెట్టారు. ఆ పథకాన్ని ప్రకటించిన తర్వాత దళిత వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరగడంతో కేసీఆర్ అనుకున్న ఎఫెక్ట్ వచ్చినట్లయింది. అయితే.. నియోజకవర్గానికి వంద కుటుంబాలే అని చెప్పడం మైనస్ అయింది. దీంతో కేసీఆర్ వ్యూహం మార్చారు. ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామని ప్రకటించారు. ముందుగా హుజూరాబాద్ నుంచే ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. హుజూరాబాద్‌లో పేదరికం అనుభవిస్తున్న ప్రతి దళిత కుటుంబానికి రూ . పది లక్షలు ఇస్తామని ప్రకటించారు. అందు కోసం అర్హుల ఎంపిక ప్రారభించబోతున్నారు.
అయితే… అది ఎన్నికల పథకమని.. హుజూరాబాద్‌లో ఉండేవారు మాత్రమే దళితులా అన్న విమర్శలు రావడంతో… కేసీఆర్ ఆ పథకం రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని ప్రకటించారు. దీనిపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు. తెలంగాణలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ రూ. పది లక్షలు నగదు బదిలీ చేయాలంటే.. కనీసం రూ. లక్షన్నర కోట్లు కావాలని తేల్చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్… కావాలంటే.. రూ. లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని ప్రకటించారని అంటున్నారు. అయితే కేసీఆర్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు పెద్దగా అమలు చేయలేకపోయారు.
రెండున్నరేళ్లు దాటిపోయినా నిరుద్యోగ భృతి.. రైతు రుణమాఫీ వంటి వాటిని అమలు చేయలేకపోయారు. వాటిపైన ప్రజల్లో అసంతృప్తి ఉంది. తాజాగా.. ఆయన రూ. లక్ష కోట్లయినా ఇస్తామని దళిత కుటుంబాలకు గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని… కానీ నిధులెక్కడివని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రకటనల ముందు.. వారి ప్రశ్నలు పెద్దగా వినిపించవు.