చంద్రబాబు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పూర్తిగా ధ్వంసం అయిన రాష్ట్రాన్ని, వ్యవస్థలు అన్నీ గాడిన పెట్టిన ర ాష్ట్రాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనపై పడింది. ఓ రకంగా ఆయన మైనస్ నుంచి ప్రారంభించాలి. ప్రారంభించారు కూడా. ఓ వైపు సూపర్ సిక్స్ పథకాల అమలు .. మరో వైపు ఆయనపై ఉండే అభివృద్ధి అంచనాలను అందుకునేందుకు మొదటి రోజు నుంచి పరుగులు పెడుతున్నారు. ఇప్పటికి నెల అయింది. నెల రోజుల పాలన బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా పాలన చేస్తున్నారు.
హామీల అమలులో తొలి అడుగు
మొదటి హామీగా సామాజిక పెన్షన్లను పెంచి పంపిణీ చేశారు. జగన్ మేనిఫెస్టోలో నాలుగేళ్ల తర్వాత మాత్రమే 250 పెంచగలనని .. నాలుగు వేలు ఇవ్వడం చేత కాదని చెప్పారు. కానీ చంద్రబాబు తొలి నెల ఒక్కొక్కరికి ఏడువేల చొప్పున పంపిణీ చేసి చూపించారు. పెరిగిన పెన్షన్లు పంపిణీ కొనసాగుతుంది. ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. ఇతర పథకాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు పదిహేను నుంచి అన్న క్యాంటీన్లు, ఉచిత బస్సు ప్రారంభించబోతున్నారు.
అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో లాంగ్ జంప్
చంద్రబాబు కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలో ప్రత్యేకమైన కసరత్తు చేశారు. వివిధ మార్గాల్లో ఏపీకి రూ. లక్ష కోట్లు వచ్చేలా చేసుకుంటున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ను పూర్తిగా కేంద్రం ఖర్చుతో నిర్మించేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఇది రూ. పాతిక వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు. అలాగే బడ్జెట్లో ఏపీకి అదనంగా అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించనున్నారు. ఇక పెట్టుబడుల ఆకర్షణలోనూ చంద్రబాబు ముందే ఉన్నారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ యూనిట్ ను పెట్టేలా కేంద్రాన్ని ఒప్పించగలిగారు. ఇది అరవై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు. అలాగే మరికొన్ని అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనలో పలువురు చంద్రబాబును కలిశారు
పోలవరం, అమరావతి విషయంలో ముందడుగు
మునిగిన పోలవరాన్ని దారికి తెచ్చేందుకు.. అమరావతిని పట్టాలెక్కించేందుకు చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. విదేశీ నిపుణుల్ని పిలిపించి పోలవరంపై పరిశీలన చేయిస్తున్నారు. అమరావతి జంగిల్ క్లియరెన్స్ కాగానే తొమ్మిది నెలల్లో భవనాలను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మరో రెండు, మూడేళ్లలో ఐకానిక్ భవనాలను .. పాలనా నగరాన్ని అందుబాటులోకి తేనున్నారు. సమాంతరంగా ప్రైవేటు ఇన్ ఫ్రా పెరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లుగా చంద్రబాబు నాలుగోసారి సీఎం కాగానే ఇల్లు అలికారు. పండగ చేయాల్సి ఉంది. అందు కోసం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంది. చంద్రబాబు అధిగమిస్తారనడంలో ఎవరికీ డౌట్ లేదు.