లోక్‌సభకు ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడో తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో.. ఈ స్థానం అటు టీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్‌లకు లిట్మస్ టెస్ట్లా మారింది. ముందస్తుగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మళ్లీ నల్లగొండ లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించడంతో మూడో తేదీన రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత ఆరు నెలల్లోపు ఉపఎన్నిక ఉంటుంది.
హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ వర్సెస్ టీఆర్ఎస్..!
అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ కు రెండు చోట్లా విజయంతో అపజయం ఎరుగని నేతగా అధిష్టానం వద్ద పలుకుబడి సాధించారు ఉత్తమ్. ఉత్తమ్ రాజీనామా తో ఖాళీ అయ్యే హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా మారే అవకాశం ఉంది. అసలే పార్టీ అధ్యక్షుడి రాజీనామాతో వచ్చే ఎన్నిక కాబట్టి కాంగ్రెస్ పార్టీ కి అది ప్రతిష్టాత్మకంగా మారనుంది. లోక్ సభ ఫలితాలతో ఊపిరిపీల్చుకున్న కాంగ్రెస్ అదే ఊపును కొనసాగించాలంటే అక్కడ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. అక్కడ కాంగ్రెస్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉత్తమ్ పై ఎక్కువగా ఉంది. లోక్ సభ ఫలితాల తర్వాత కొంత డెఫిన్స్ లో పడ్డ అధికార టిఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్ ఫలితాలతో టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్న అపవాదు తొలగించుకోవాలంటే గెలిచి తీరాల్సిన అనివార్యత అధికార పార్టీది. అందుకోసం ఆ పార్టీ సవాలుగా తీసుకుని పనిచేసే అవకాశం ఉంటుంది. అసలే ఉత్తమ్ కు మంచి పట్టున్న నియోజక వర్గం కావడంతో హుజూర్ నగర్ లో జరగనున్న ఉపఎన్నికల్లో బిగ్ ఫైట్ తప్పదన్న వాదనలు మొదలయ్యాయి.
భార్యను నిలబెట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉత్తమ్‌దే..!
రెండు పార్టీల్లోనూ హుజూర్ నగర్ నుంచి పోటీ చేసే అభ్యర్థులేవరన్న చర్చ మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో ఉత్తమ్ పై టిఆర్ఎస్ నుంచి ఎన్నారై సైదిరెడ్డి పోటీ చేశారు. అప్పట్నుంచి ఆయనే..నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. అధికార పార్టీ మళ్ళీ అతన్నే పోటీకి నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లో ఓడిపోయిన కవిత పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా… టీఆర్ఎస్ వర్గాలు మాత్రం.. నోరు మెదపడం లేదు. కానీ హుజూర్ నగర్లో.. కవిత పోటీ చేసే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేత జానారెడ్డి పేరు వినిపించినప్పటికి ఆయనే స్వయంగా ఆ వార్తలను ఖండించారు. తను పోటీచేయనంటూ తేల్చిచెప్పారు. ఇక ఇప్పుడు ఉత్తమ్ భార్య కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఆమె మాత్రం ఆర్థిక పరిస్థితుల కారణంగా పోటీ చేయలేనని చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ నియోజక వర్గంలో విజయం సాధించాలంటే పద్మావతినే సరైన అభ్యర్థిగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టీఆర్ఎస్లో కవిత కాదు.. ఎవరైనా కేసీఆర్‌దే స్పెషల్ ఇంట్రెస్ట్..!
హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం. అక్కడ వరుసగా విజయం సాధిస్తూ ఉండటంతో ఆ కుటుంబం నుంచి పోటీ చేస్తేనే నియోజక వర్గ ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఉత్తమ్ సైతం తన సొంత నియోజక వర్గాన్ని ఇతరులకు వదులుకోరనే చర్చ జరుగుతుంది. అక్కడ పార్టీ గెలిపించి పట్టునిలబెట్టుకోవాలంటే ఉత్తమ్ పద్మావతినే సరైన క్యాండేట్ గా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇతర నాయకుల నుంచి కూడా పెద్దగా ఆ స్థానాన్ని ఆశిస్తున్న వారు కూడా లేకపోవడం తో ఆమె అభ్యర్థిత్వమే ఖరారయ్యే అవకాశాలున్నాయి. మొత్తనికైతే అటు అధికార పార్టీ ఇటు హస్తం పార్టీకి ఇక్కడ గెలవడం అనివార్యం కావడం వల్ల హుజూర్ నగర్ ఉప ఎన్నిక స్టేట్ పాలిటిక్స్ ను మరోమారు హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.