అమూల్ సంస్థ ఇచ్చే దాని కన్నా ఎక్కువ ప్రతిఫలం రైతులకు సంగం డెయిరీ ప్రకటించింది. బెయిల్పై జైలు నుంచి విడుదలైన వెంటనే.. విజయవాడలో సంగం డెయిరీ పాలకవర్గాన్ని సమావేశపరిచి.. ధూళిపాళ్ల నరేంద్ర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో.. రైతులు ఎవరూ అమూల్వైపు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వానికి మరోసారి కోపం వచ్చినట్లయింది. అసలు పాలకమండలి సమావేశం ఎలా నిర్వహిస్తారని.. రెండు, మూడు రోజుల నుంచి ఆరోపణలు గుప్పిస్తూ.. తాజాగా… కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారని కేసు పెట్టేశారు. ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంతో.. ఏదో ఒక కేసు పెట్టమన్న పై నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు.. పోలీసులకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఎందుకంటే.. ఈ కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘన కేసు.. సంగం డెయిరీ పాలకమండలిపై పెట్టింది ఓ ఎస్ఐ. అదీ కూడా.. సమావేశం జరిగిన వారం రోజుల తర్వాత. ఈ కేసు నమోదు చేసి… పాలక మండలి కూడా ఆశ్చర్యపోయింది. మే 29వ తేదీన విజయవాడలోని ఒక హోటల్ లో పాలకవర్గం సమావేశం జరిగితే.. అప్పుడు ఏ పోలీసులు అడ్డు చెప్పలేదు. ఈ సమావేశంలో వందల మంది పాల్గొనలేదు. పాలకవర్గంలోని 12 మంది సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. సమావేశం జరగిన వారం రోజుల తర్వాత దీనిపై ఎస్ఐ ఫిర్యాదు చేస్తే.. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, పాలకవర్గ సభ్యులపై ఐదు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసులు విచారణకు పిలిస్తే.. కంపెనీ సెక్రటరీ వెళ్లి.. అన్నీ నిబంధనలు పాటించామని రాత పూర్వకంగా వివరణ ఇచ్చి వచ్చారు.
12 మంది పాల్గొంటే.. హోటల్లో 30 భోజనాలకు బిల్లు కట్టారని.. పోలీసులు లాజిక్ అడిగారు. డ్రైవర్లకు కూడా భోజనాలు పెట్టించారని సంగం డెయిరీ సిబ్బంది సమాధానం ఇచ్చారు. రెండు రోజులుగా.. ఈడీ కేసులు అని… నరేంద్ర బెయిల్ క్యాన్సిల్ చేయమని పిటిషన్ వేస్తామని వైసీపీ వర్గాలు బెదిరింపులకు దిగాయి. కానీ.. ఏదీ లేకపోవడంతో.. చివరికి కర్ఫ్యూ నిబంధనల కేసు పెట్టారు.