ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తొమ్మిదో క్లీన్ చిట్ లభించింది..! అదేనండీ… కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. మోడీకి మీద ఈసీకి ఫిర్యాదులు అందడమే ఆలస్యం… వెంటనే క్లీన్ చిట్ ఇచ్చేందుకు సిద్ధమైపోతోందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు తగ్గట్టుగానే పరిస్థితి ఉంది. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీని ఉద్దేశించి మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించి, క్లీన్ చిట్ ఇచ్చేసింది. శనివారం నాడు యూపీలోని ప్రతాప్ గఢ్ లో మోడీ మాట్లాడుతూ… మీ నాన్న (రాజీవ్ గాంధీ)ని మిస్టర్ క్లీన్ అని చుట్టూ ఉన్నవారు మాత్రమే పొగడ్తలతో ముంచెత్తారనీ, కానీ ఆయన జీవితం బ్రష్టాచారీ నంబర్ 1 గానే ముసిగిందని రాహుల్ గాంధీని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ… మోడీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ నిబంధనల ఉల్లంఘన కిందికి రావని స్పష్టం తేల్చి చెప్పేసింది. మోడీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డట్టు కాదనీ, కాబట్టి చర్యలు తీసుకునే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేసింది. దీంతో కలిపి ఇంతవరకూ మోడీకి ఈసీ ఇచ్చిన క్లీన్ చిట్ ల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. అయితే, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడితో వదిలేట్టుగా కనిపించడం లేదు. ప్రధానమంత్రి మోడీపై చేస్తున్న ఫిర్యాదుల మీద ఎన్నికల సంఘం సరిగా స్పందించడం లేదనీ, పారదర్శంగా వ్యవహరించడం లేదంటూ సుప్రీం కోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. ఈ మేరకు పార్టీ ఎంపీ సుష్మితా దేవ్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కోర్టుకు కాంగ్రెస్ వెళ్లిన కొన్ని గంటల్లోనే మరోసారి ఈసీ స్పందించడం… మోడీ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదంటూ స్పష్టం చేయడం విశేషం.
ఈ ఎన్నికల్లో ఎన్నిల సంఘం తీరుపై కూడా సర్వత్రా విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. మోడీ హయాంలో రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థలన్నీ ఒక్కోటిగా విశ్వాసాన్ని కోల్పోతున్నాయన్న విమర్శలు చాలా వచ్చాయి. ఇప్పుడు ఈసీ కూడా ప్రధానిపై అందే ఫిర్యాదులకు ఒకలా, ఇతరులపై వస్తున్న ఫిర్యాదుల విషయంలో మరోలా వ్యవహరిస్తోందన్న సందేహాలు సామాన్య ప్రజల్లోకి సైతం వెళ్తున్నాయి. భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ పేరుతో వ్యవహరిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. మరి, ప్రధాని విషయంలో ఈసీ స్పందిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.