ప్రభాస్ – హనురాఘవపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `ఫౌజీ` అనే పేరు పెట్టారు. అధికారిక ప్రకటన రావాల్సివుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడు. నేతాజీ – ఆజాద్ హింద్ ఫౌజ్కీ ఈ కథకూ చిన్నపాటి లింక్ వుంది. కథానాయికగా ఇమాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో మరో నాయికకూ ఛాన్స్ వుంది. అరగంట పాటు ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఓ కథానాయిక కావాలి. ఆమె కోసం చిత్రబృందం చాలా కాలంగా అన్వేషణ చేస్తోంది.
‘ఫౌజీ’ కథలో ఫ్లాష్ బ్యాక్ చాలా కీలకమని సమాచారం. కథకు సంబంధించిన ఆయువు పట్టు అక్కడే ఉందని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించే ప్రతీ పాత్రా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించే హీరోయిన్ కోసం ఓ స్టార్ ని ఎంచుకొంటే బాగుంటుందన్నది ఆశ. అందుకోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది పేర్లని లిస్టవుట్ చేశారని, అందులో సాయి పల్లవి కూడా ఉందని తెలుస్తోంది. ఇటీవల హను రాఘవపూడి సాయిపల్లవితో హను భేటీ వేశారని, ఈ సినిమా, కథ, అందులోని తన పాత్ర సాయి పల్లవికి నచ్చాయని, అయితే తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది. సాయి పల్లవి నటించిన ‘తండేల్’ ఈనెలలోనే విడుదల కానుంది. ప్రమోషన్లలో బిజీగా వుంది. ఈ సినిమా విడుదలైన తరవాత.. సాయిపల్లవి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ సాయి పల్లవి ఓకే అంటే… ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వచ్చినట్టే.