ప్రభాస్ సినిమా అంటే… భారీ స్దాయిలో ఉండాల్సిందే. అది పాన్ ఇండియా సినిమా కావాల్సిందే. ఇవన్నీ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే విషయాలే. కానీ… ప్రతీసారీ పాన్ ఇండియా సినిమా చేయడం అంత ఈజీ కాదు. దాని వెంట అనేక సమస్యలున్నాయి. అందుకే ప్రభాస్ సినిమాలు తరచూ ఆలస్యం అవుతూ ఉంటాయి. `రాధే శ్యామ్` కూడా చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు కూడా రాధా శ్యామ్ అనుకున్న సమయానికి రావడం లేదు. ఈ దసరాకి వస్తే గొప్పే అంటున్నారంతా.
అయితే రాధే శ్యామ్ కి ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు సకాలంలో జరగడం లేదని టాక్. ఎయిటీస్ నేపథ్యంలో సాగే కథ ఇది. దానికి అనుగుణంగా కొన్ని సెట్స్ వేశారు. అయితే సీజీ పై ఎక్కువగా ఆధారపడాల్సివచ్చింది. సీజీ పనులు చాలా కంపెనీల చేతుల్లో ఉంచారు. కానీ.. అవేమీ ఇప్పుడు సరిగా వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. అనుకున్న సమయానికి వీఎఫ్ఎక్స్ పూర్తి కావడం కష్టమని.. ఆయా సంస్థలు చిత్రబృందానికి చెప్పేశాయట. అందుకే ఇప్పుడు రాధే శ్యామ్ టీమ్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. ప్రపంచమంతా కోవిడ్ తో అల్లాడుతున్న నేపథ్యంలో… ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి భయపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోం పద్ధతి చాలా దేశాల్లో నడుస్తోంది. వీఎఫ్ఎక్స్ పనులన్నీ విదేశీ సంస్థలకు అప్పగించడం వల్ల.. అక్కడి పరిస్థితుల దృష్ట్యా పనులు మరింత ఆలస్యం అవుతున్నాయి.