ప్రత్యేక హోదా.. ముగిసిపోయిన అధ్యాయం అని కేంద్రం ఎప్పుడో తేల్చేసింది. కేంద్రం విదిల్చిన ప్యాకేజీని మహాప్రసాదం అంటూ చంద్రబాబు సర్కారు కళ్లకద్దుకుని సంతృప్తి చెందింది. హోదాపై ఉద్యమిస్తా అంటూ ట్వీట్లు పెట్టిన పవన్ కూడా వెనక్కి తగ్గిపోయారు! కానీ, ఇంకా ప్రత్యేక హోదా పోరాటం కొనసాగుతుందని ప్రతిపక్ష నేత జగన్ అంటున్నారు. తాజాగా ఆయన ఢిల్లీ వెళ్లొచ్చాక అధికార పక్షం నుంచి వ్యక్తమౌతున్న విమర్శలపై స్పందించారు. ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రితో తాను దాదాపు పావుగంట సేపు మాట్లాడానని జగన్ చెప్పారు. అయితే, ఎంపీల రాజీనామా విషయంలో జగన్ మాట మార్చడం ఇక్కడ మనం గమనించాలి!
హోదా విషయమై వైకాపా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎంపీల రాజీనామా అనేది చివరి అస్త్రం అన్నారు. ముందుగా దౌత్యం, ఆ తరువాత లౌక్యంతో హోదాని సాధించుకోవాలన్నారు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెడతామని, ఆ విషయాన్ని సభలో చర్చించాలంటే వైకాపా ఎంపీలు సభలో ఉండాలి కదా అన్నారు. తెలుగుదేశం ఎంపీలు ఎలాగూ ఆ పనిచేయలేరు కాబట్టి, తమ పార్లమెంటు సభ్యులు సభలో పోరాటం చేస్తారన్నారు. ప్రత్యేక హోదాని ఎన్నికల అంశంగా చేస్తామనీ, హోదాకు ఎవరు మద్దతు ఇస్తే వారితోనే కలుస్తామని జగన్ ప్రకటించారు. హోదా విషయంలో మోడీ సర్కారుకు ఇంకా సమయం ఇస్తున్నట్టు జగన్ అన్నారు.
ప్రత్యేక హోదా పోరాటం అంటూ ఉరకలేసిన జగన్.. ఇప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గినట్టుగానే మాట్లాడారు. నిజానికి, వైకాపా ఎంపీలతో రాజీనామాలు చేయించాలని ఎవ్వరూ డిమాండ్ చెయ్యలేదు. వారే స్వయంగా ప్రకటించారు. అదే పోరాట పంథా అన్నారు. ఇప్పుడేమో దాన్నే చివరి అస్త్రం అంటున్నారు. ఇంకోపక్క, ఇది ముగిసిపోయిన అధ్యాయం అని కేంద్రం ఎప్పుడో తేల్చిసింది. దానిపై ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్రం స్పందించే పరిస్థితి లేదు, ఇకపై రాదు. అయినాసరే, కేంద్రానికి ఇంకొంత సమయం ఇద్దామని వ్యాఖ్యానించడం ఏంటో మరి?
నిజానికి, ప్రత్యేక హోదా పోరాటంలో జగన్ మొదట్నుంచీ కొన్ని తప్పటడుగులు వేశారు. హోదా డిమాండ్ మాంచి ఊపులో ఉన్నప్పుడు ఉద్యమాన్ని అందుకోలేకపోయారు. జగన్ ప్రతిపక్ష నేతగానే మిగిలిపోయారు తప్ప, ఉద్యమ నేతగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని వైకాపా కార్యక్రమంగా నడిపారే తప్ప.. దాన్నొక ప్రజా ఉద్యమం స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరగలేదని చెప్పక తప్పదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాజీనామాలు చేస్తామని వారే ప్రకటించారు. తెలుగుదేశంతో సహా ఎవరి ఒత్తిడిగానీ, డిమాండ్ గానీ ఈ విషయంలో లేదు. ఇప్పుడు వారే వెనక్కి తగ్గుతున్నారు. చివరి అస్త్రం అంటున్నారు! దీంతోపాటు, ఇది ఎన్నికల అంశం అని కూడా చెబుతున్నారు. మొత్తానికి, ఈ విషయంలో జగన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు!