అర్జున్ రెడ్డి సూపర్.. డూపర్.. కేక అన్నవాళ్లు కూడా ‘ఈ సినిమా సెకండాఫ్ కాస్త విసిగించింది.. నిడివి ఎక్కువ’ అనేశారు. అదీ పాయింటే. ఈమధ్య కాలంలో మూడు గంటల సినిమా చూళ్లేదు. సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి.. ఆ మూడు గంటల సినిమానీ ఓపిగ్గా చూస్తున్నారు యూత్. అది చాలదన్నదట్టు ఇప్పుడు కొత్తగా మరో పది హేను నిమిషాలు పెంచేశారు. నిడివి ఎక్కువైందన్న కారణంతో ట్రిమ్ చేసిన ఆ సన్నివేశాల్ని ఇప్పుడు జోడించారు. అంటే అర్జున్ రెడ్డి సినిమా మూడు గంటల పదిహేను నిమిషాలన్నమాట. ఓ సారి సినిమా చూసి ఆ పదిహేను నిమిషాల కోసం మరో సారి వెళ్లిన వాళ్లకు ఓకే. కొత్తగా ఈ సినిమా చూద్దాం అనుకొన్న వాళ్లు ఇంత నిడివి భరించగలరా?? ఓవైపు లెంగ్త్ మైనస్.. మైనస్ అంటుంటే – మరోవైపు ఈ సినిమాని ఇంకాస్త సాగదీయాలని చూడ్డం నిజంగా అర్జున్ రెడ్డి టీమ్ చేస్తున్న సాహసమే. ఆ పదిహేను నిమిషాల్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అని… యువతరం మరోసారి అర్జున్ రెడ్డి చూస్తారన్న నమ్మకం.. చిత్రబృందానిది. ఇప్పటికే ఈ సినిమాపై లాభాలొచ్చేశాయ్. జనం చూసినా, చూడకపోయినా ఫర్వాలేదు. పదిహేను నిమిషాలు జోడించినంతమాత్రాన హిట్ సినిమా ఫ్లాప్ అయిపోదు. పైగా రిపీటెడ్ ఆడియన్స్ టికెట్స్ బాగా తెగుతాయి. అందుకే… 15 నిమిషాల స్టఫ్‌ని మళ్లీ తగిలిస్తున్నారు. ఈ జోరుతో ఇంకొన్ని రోజులు అర్జున్ రెడ్డి దగ్గర జనాలు కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.