ఒకే హీరో.. ఒకే దర్శకుడు, ఇంచుమించుగా ఒకే కథ… వీటితో మూడు సినిమాలు తీయడం, టైటిల్‌ని ఓ బ్రాండ్‌గా మార్చడం ‘సింగం’కే సాధ్యమైంది. తొలి రెండు చిత్రాల స్థాయిలో కాకపోయినా.. సింగం 3కీ మంచి ఆదరణే దక్కింది. సింగం సిరీస్‌లో ఇక సినిమాలు రావేమో అనుకొంటున్న తరుణంలో సింగం 4 కూడా వస్తుందని సెలవిచ్చాడు సూర్య. అయితే ఇప్పడే కాదట. అందుకు కనీసం ఐదారేళ్ల సమయం పడుతుందట. ఈలోగా మరో కొత్త సిరీస్‌కి సూర్య – హరిలు శ్రీకారం చుట్టబోతున్నార్ట. ఈ విషయాన్ని హరినే మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. సూర్యతో కలసి సినిమా చేయడం అంటే తనకెంతో ఇష్టమని, తమ ప్రయాణం పన్నెండేళ్ల నుంచీ కొనసాగుతోందని, ఇక మీదటా దాన్ని కంటిన్యూ చేయాలని వుందని చెప్పాడు హరి. అయితే సింగం లాంటి మరో కొత్త కథతో.. మరో కొత్త సిరీస్‌తో సినిమా మొదలెడతామని, సింగం అభిమానుల్ని ఎంత థ్రిల్‌కి గురిచేసిందో, ఈ కొత్త సిరీస్ కూడా అంతే ఉత్కంఠతకు గురి చేస్తుందని హామీ ఇచ్చాడు హరి.
హరికి తెలుగులోనూ సినిమాలు చేయాలని వుందట. అందులోనూ ఎన్టీఆర్‌కి తాను అభిమానని, టెంపర్ సినిమా తనకు బాగా నచ్చిందని, ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేసుకొని కలుస్తానని అంటున్నాడు హరి. ప్రస్తుత లెక్కలు తీస్తే… హరి కల నెరవేరడానికి చాలా టైమే పట్టేట్టు ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబితో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తరవాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే రెండేళ్లయినా పడుతుంది. ఈలోగా ఎన్టీఆర్ కోసం కథ తయారు చేయడానికి కావల్సినంత సమయం దొరికినట్టే. పోలీస్ కథల్ని రాసుకోవడంలో సిద్దహస్తుడు హరి. ఎన్టీఆర్ టెంపర్ హరికి బాగా నచ్చిందట. అందులో ఎన్టీఆర్ కూడా పోలీసే. వీరిద్దరి నుంచి కూడా ఓ పోలీస్ స్టోరీ రావడానికే ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.