‘విశ్వంభర’ తరవాత చిరంజీవి సినిమా ఏది? ఎవరితో? అనే విషయంలో ఎలాంటి స్పష్టతా లేదు. ‘విశ్వంభర’ ముందే అనుకొన్నట్టు సంక్రాంతికి వచ్చేస్తే, ఈపాటికి చిరు తదుపరి సినిమాపై ఓ క్లారిటీ వచ్చేది. కానీ జనవరి నుంచి వేసవికి వాయిదా పడడంతో, చిరు కూడా తన సినిమా విషయంలో రిలాక్డ్స్ గానే ఉన్నారు. ఈలోగా దర్శకులు, రచయితలు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. చిరంజీవి నుంచి ఓ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకొని, సినిమా మొదలెట్టాలన్న తొందలో ఉన్నారు.
రచయిత బీవీఎస్ రవి కూడా చిరంజీవికి ఓ కథ చెప్పారు. అయితే దర్శకుడు మాత్రం ఆయన కాదు. మోహన్ రాజాతో కలిసి ఆయన వర్క్ చేస్తున్నారు. కథ దాదాపుగా సిద్ధమైంది. చిరు ‘ఓకే’ అనాలంతే. చిరంజీవి కోసం బీవీఎస్ రవి ఓ సామాజిక సందేశం నిండిన కథ రాశారట. ‘ఠాగూర్’ తరహా సినిమా అని, బలమైన సోషల్ మెసేజీతో పాటు, కమర్షియల్ హంగులన్నీ ఉంటాయని సమాచారం. ఇదే విషయంపై రవి కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. చిరంజీవి అంటే, పాటలు డాన్సులు గుర్తొస్తాయని, అలాంటి సినిమాలు ఆయన చాలానే చేశారని, ఓ పెద్ద స్టార్ బలమైన సందేశాన్ని ఇస్తే, చాలామందికి చేరువ అవుతుందని, తాను అలాంటి కథే సిద్ధం చేశానని చెప్పుకొచ్చారు బీవీఎస్ రవి. ‘విశ్వంభర’ తరవాత తమ సినిమానే మొదలవుతుందని కూడా డిక్లేర్ చేశారు.
అయితే… చిరు సన్నిహితులు మాత్రం ‘విశ్వంభర’ తరవాత ఏ సినిమా చేయాలన్న విషయంలో చిరు ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. బీవీఎస్ రవి కథ కూడా లైన్ లో ఉందని, అయితే చిరు ఆమోద ముద్ర వేయాలని అంటున్నారు.