జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనుంది. సోమవారం పెట్టాల్సి ఉన్నప్పటికీ ఎందుకో ఆ పని చేయలేదు. కానీ మంగళవారం మాత్రం పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తమ పార్టీ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేసింది. పెట్టబోయేది రాజ్యాంగసవరణ బిల్లు కాబట్టి మూడింట రెండువంతుల మెజార్టీ అవసరం. బిల్లుపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఎంత మంతి సభ్యులు ఉంటే అంత మందిలో ఈ మెజార్టీ అవసరం. మిగిలిన వారు ఓటింగ్ ను బహిష్కరించినట్లు లెక్క .
అయితే ఈ బిల్లును కేంద్రం హడావిడిగా ఆమోదించాలని అనుకోవడం లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపి .. అందరి ఆమోదంతోనే ఆమోదించాలని అనుకుంటోంది. బలవంతంగా బిల్లుగా మార్చాలని అనుకోవడం లేదు. జేపీసీకి పంపితే అన్ని పార్టీల అభిప్రాయాలు చెబుతాయి. దానికి తగ్గట్లుగా మార్పులు చేయగలిగితే చేస్తారు. లేకపోతే లేదు కానీ ప్రజాస్వామ్య అద్దంగా ముందుకెళ్లినట్లు అవుతుంది. ఇందు కోసం కొంత ఆలస్యం అవుతుంది. అంతకు మించి నష్టం ఏమీ ఉండదని భావిస్తున్నారు.
ప్రస్తుతం లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీ కూటమికి మూడింట రెండు వంతుల మెజార్టీ లేదు. ఇప్పుడు బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ సహకారం తప్పనిసరి. అందుకే జేపీసీలో ఆ పార్టీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల సమయాన్ని తగ్గించడం సాధ్యం కాదు అందుకే.. జమిలీ ఎన్నికల కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల సమయాన్ని పెంచేందుకు వెసులుబాటు కల్పించేలా సవరణ చేయబోతున్నారని చెబుతున్నారు. మొత్తంగా.. జేపీసీ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఓటింగ్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.