రాజమౌళి, శంకర్… ఇద్దరూ ఇద్దరే. మన దేశం గర్వించదగ్గ దర్శకులు. దక్షిణాది చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకులు. ఇద్దరి సినిమాల్లో భారీతనం కనిపిస్తుంది. తన ప్రతి సినిమాలోనూ రాజమౌళి కథతో పాటు భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెడితే… శంకర్ కథతో పాటు ఏదైనా సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వీరిద్దరి మధ్య మరో వ్యత్యాసం కూడా వుంది. అదేంటంటే… తన ప్రతి సినిమా కథను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు రాజమౌళి. ఆయన తీయబోయే సినిమా కథ, కీలక సన్నివేశాల గురించి ఇంట్లో ప్రతి ఒక్కరికీ తెలిసే వుంటుంది. ప్రతి సినిమాకూ కుటుంబ సభ్యుల అభిప్రాయాలను రాజమౌళి తెలుసుకుంటారు. కుటంబ సభ్యుల్లో చాలామంది ఆయన సినిమాకు పని చేస్తుంటారు. శంకర్ మాత్రం ఈ పద్ధతికి పూర్తి విరుద్ధం. ఇంట్లో ఎవరికీ తను తీయబోయే సినిమా కథ అసలు చెప్పారు. తండ్రి తీయబోయే కథ, సినిమా గురించి తెలుసుకోవాలని శంకర్ పిల్లలు అమితాసక్తి కనబరుస్తార్ట. “పిల్లలకు నా సినిమా విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి వుంటుంది. నేను కొన్ని విషయాలే చెబుతా. కథ అసలు చెప్పను. అందువల్ల, నా ఫొనులో స్టిల్స్ చూస్తారు. నేను సినిమా గురించి ఇతరులతో ఫోనులో మాట్లాడుతుంటే వింటారు. కొన్ని రోజులకు వీటన్నిటినీ క్రోడీకరించి ఓ కథ రాసి నాకు వినిపిస్తారు. నేను తీయబోయే సినిమా కథ ఇది కాదని చెబుతుంటాను” అని శంకర్ అన్నారు.