మాజీ సైనికులు కోరుతున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ పై రెండో యుద్ధాన్ని గెలిచిన ఆగస్టు 28న ప్రధాని ఈ మోడీ ఈ ప్రకటన చేస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఆరోజు మనం యుద్ధం గెలిచి 50 ఏళ్లయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుతున్నారు. కాబట్టి అదే సరైన సమయమని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.
మాజీ సైనికుల ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ విధానానికి ఇదివరకే ఓకే చెప్పినందున ఇక నాన్చవద్దని మోడీ భావిస్తున్నారు. ఈ విధానం అమలు తీరు, ఖజానాపై పడే భారం వగైరా వివరాలను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మంగళవారం నాడు మోడీకి సవివరంగా చెప్పారు.
ఇక ప్రధాని కార్యాలయం ఇదే పనిలో బిజీగా ఉంది. అయితే, దీనికి మరో కోణం కూడా ఉంది. ఈ విధానాన్ని అమలు చేస్తే ఖజానాపై భారం పడటమే కాదు, తర్వాత మరిన్ని చిక్కులు వస్తాయనే వాదన వినవస్తోంది. ఈ విధానం వల్ల మాజీ సైనికుల పెన్షన్ బిల్లుకు అదనంగా ఏటా సుమారు 20 వేల కోట్లు ఖర్చవుతుంది. అప్పుడు ప్రతి ఏడాది వారి పెన్షన్ బిల్లు 75 వేల కోట్లకు చేరుతుంది.
ప్రస్తుతం సర్వీసులో ఉన్న సైనికుల వేతనాలకు ప్రభుత్వం ఏటా ఖర్చు చేసే మొత్తం 93 వేల కోట్ల పైచిలుకు. అంటే, ప్రస్తుత ఉద్యోగుల వేతనాల్లో దాదాపు 80 వంతు మొత్తాన్ని పెన్షన్ చెల్లింపులకు వెచ్చించాల్సి ఉంటుంది. మాజీ సైనికులే కాబట్టి వారికోసం ఈ భారాన్ని భరించడానికి కేంద్రం సిద్ధపడుతోంది.
అయితే, పారా మిలటరీ బలగాలు కూడా ఇదే డిమాండ్ చేస్తే అప్పుడు ఎలా? సైనికులతో సమానంగా యుద్ధాలు చేస్తూ, రిస్కు తీసుకుంటూ సరిహద్దుల్లో, రకరకాల వాతావరణ పరిస్థితుల్లో పారా మిలటరీ బలగాలు పనిచేస్తాయి. అవి.. బి.ఎస్.ఎఫ్., సి.ఆర్.పి.ఎఫ్., ఐ.టి.బి.పి. వగైరా. ఈ జవాన్లు కూడా ఆర్మీ సైనికులతో సమానంగా విధులు నిర్వహిస్తారు. కాబట్టి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అడిగితే కాదని కేంద్రం ఎలా అనగలదు? అప్పుడు వీరికీ వర్తింపచేస్తే మరికొన్ని వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అయితే, సరిహద్దులు కాపాడే వారికి ఎంత ఇచ్చినా తక్కువే అనే వారూ ఉన్నారు.
జై జవాన్ అనే విషయంలో కాదని ఎవరంటారు?