జై జవాన్ జై కిసాన్. ఇది మన ప్రభుత్వ విధానం, నినాదం. దేశాన్ని కాపాడే జవాన్, దేశానికి అన్నంపెట్టే కిసాన్, వీరిద్దరూ లేకపోతే మనం ప్రశాంతంగా ఉండలేం, కనీసం బతకలేం. కానీ ప్రభుత్వాల నిర్వాకం వల్ల దేశంలో దయనీయ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి.
జవాన్ సైనికుడు. తుపాకీ ఎత్తి యుద్ధం చేసే వాడు. అవసరమైతే గళమెత్తి పోరాడగలడు. ప్రభుత్వాన్ని నిలదీయగలడు. మీడియా మద్దతును సాధించగలడు. పాలకులను కదిలించడలడు. డిమాండ్లను సాధించగలడు. వన్ ర్యాంక్ వన్ పెన్షనే ఇందుకు ఉదాహరణ.
మరోవైపు, కిసాన్ బతుకు దయనీయం. ఓటు బ్యాంకు రాజకీయాల్లోంచి పుట్టుకొచ్చిన ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలు రైతులకు మేలు చేయడం లేదని ఎవరో చెప్పనవసరం లేదు. ఇప్పటికీ రోజుకు ఐదు నుంచి పది మంది రైతుల ఆత్మహత్యలే చాటి చెప్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 7 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు గొప్పగా ప్రకటించిన రుణమాఫీ అడ్డంగా విఫలమైందనే వాస్తవం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది.
రోజూ ఆత్మహత్యలకు నిత్యకృత్యంగా మారాయి. విత్తనాల కొనుగోలు నుంచి మార్కెట్లో ధాన్యం అమ్మేదాకా, ఏ దశలోనూ ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవు. కనీసం నాణ్యమైన విత్తనాలు అదనులో సిద్ధంగా ఉంచడం కూడా ఈ ప్రభుత్వాలకే చేతకాని విషయం. విత్తనాలు, ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లో నిలబడే దురవస్థ, ప్రపంచంలో ఆఫ్రికాలోని రైతులకు కూడా ఉండదేమో.
అష్టకష్టాలు పడి పంట పండిద్దామంటే బ్యాంకుల రుణాలు ఓ ప్రహసనం. ప్రయివేటు వడ్డీ వ్యాపారులు నడ్డివిరిగే వడ్డీతో వాయించినా మౌనంగా భరించాలి. ఎలాగోలా పంటను పండించి మార్కెట్ యార్కుకు తీసుకుపోతే అక్కడ పరిస్థితులు దారుణం. అనేక మార్కెట్లలో కనీసం మంచినీటికీ దిక్కుండదు. తల దాచుకునే చోటుండదు. దళారులు, స్వార్థపరులైన వ్యాపారులకు అడ్డుండదు.
ఇదే కిసాన్ స్థలంలో జవాన్ ఉండి ఉంటే ఈ దుర్భర దురవస్థకు కారణమైన వారిమీద తుపాకి ఎక్కుపెట్టే వాడేమో. కానీ రైతు దుర్బలుడు. జవానులా ఎదురు తిరగలేదు. అదే ప్రభుత్వాలకు అలుసై పోయింది. రైతు పేరిట వేల కోట్లు ఖర్చవుతాయి. రైతు ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాలు జాలిపడుతూనే ఉంటాయి. ఇదొక సైకిల్ చక్రం. నిజంగా కిసాన్ కు జై కొట్టే రోజు, రైతు రాజయ్యే రోజు ఎప్పుడొస్తుందో?