కరోనాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కోసం… తెలుగుదేశం పార్టీ విరాళాలు ప్రకటించేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యక్తిగతంగా రూ. పది లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల జీతాన్ని కూడా విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఎంపీలు అయితే.. తమ ఒక నెల జీతం మాత్రమే కాదు.. ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా కేటాయిస్తామని కలెక్టర్లను ప్రతిపాదనలు పంపారని కోరుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏకంగా రు. ఐదు కోట్లు ఇస్తానని ప్రకటించారు. రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ కూడా అలాంటి ప్రకటనలే చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు విరాళాలు.. ప్రకటించేసిన తరవాత… వైసీపీ నేతలు ఇంకా స్పందించలేదేమి అన్న చర్చ సహజంగా వస్తుంది. దీని కోసమే.. టీడీపీ ఇలా వ్యూహాత్మకంగా.. విరాళాల ప్రకటనలు చేస్తుందేమోనని వైసీపీ నేతలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు .. గోడ దూకంగా.. ఇరవై మాత్రమే… ఎంపీలు.. ముగ్గురు మాత్రమే. మిగతా ఇరవై రెండు మంది ఎంపీలు…ఆరుగురు రాజ్యసభ ఎంపీలు, 151 ప్లస్ మరో మూడు మొత్తం 154 మంది ఎమ్మెల్యేలు వైసీపీ జాబితాలో ఉన్నారు. వారందరూ కూడా.. తమ నెల జీతాలను.. ఎంపీ, ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి.. కరోనా పోరాటానికి విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇప్పటి వరకూ.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రమే.. రూ. పది లక్షలు ప్రకటించారు. ఇతర వైసీపీ ప్రజాప్రతినిధులెవ్వరూ.. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం.. విరాళం ప్రకటించలేదు. తాము విరాళాలు ప్రకటించామని… టీడీపీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకంటుంది. దాంతో సహజంగానే అందరి దృష్టి వైసీపీ నేతలపై పడుతుంది. ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని.. వైసీపీ కూడా అనుకుంటోంది. దీనిపై ఒకటి , రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.