ఆంధ్రప్రదేశ్లో ఐదు నెలల కిందట జరిగిన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార వైసీపీకి ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంతో పాటు నారావారి పల్లెలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహిస్తున్నామని బహిష్కరిస్తున్నట్లుగా టీడీపీ ప్రకటించింది. అయితే అప్పటికి నామినేషన్ల పర్వం ముగియడంతో టీడీపీ అభ్యర్థులు అధికారికంగా బరిలో ఉన్నారు. ఈ కారణంగా కొన్నిచోట్ల టీడీపీకి బలమున్న చోట్ల ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. అయితే అది చాలా తక్కువలోనే ఉంది.
ఇక సీరియస్గా బరిలో నిలిచిన బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అక్కడక్కడ జనసేన మాత్రమే తన ప్రభావాన్ని చూపి.. కొంత మొత్తంలో ఎంపీటీసీ స్థానాలను గెల్చుకుంది. అసాదారణంగా ఏకగ్రీవాలుఅయ్యాయి . ఎన్నికలు జరిగిన చోట.. దాడులు, దౌర్జన్యాల జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీకి చెందిన ఓటర్లు దూరంగా ఉండటంతో పోలింగ్ శాతం కూడా తక్కువగా నమోదైంది. పోలింగ్ జరిగి ఐదు నెలలు దాటిపోవడంతో బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్లు కొన్ని చోట్ల పాడైపోయాయి. వాటి విషయంలో రిటర్నింగ్ అధికారులే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
మొత్తంగా ఏపీలో ఉన్న జడ్పీ,మండల పరిషత్లు అన్నీ వైసీపీ ఖాతాలో పడటం ఖాయమని అనుకోవచ్చు. ఈ ఫలితాలతో ప్రజాతీర్పు ఏకపక్షంగా ఉందని తేలిపోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారని.. టీడీపీ నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఈ తీర్పు ప్రజా తీర్పుగా భావిస్తే తక్షణం అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేస్తున్నారు.