మాజీ రాష్ట్రపతి మృతికి సంతాపంగా నేడు జాతీయ శలవు దినంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. నేటి నుండి వారం రోజులు సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించింది. అబ్దుల్ కలాం భౌతిక కాయం కొద్ది సేపటి క్రితమే ప్రత్యేక విమానంలో డిల్లీ చేరుకొంది. ఆయన మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడి, గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తదితరులు సంతాపం తెలిపారు. మరికొద్ది సేపటిలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమయ్యి కలాం మృతికి సంతాపం తెలియజేస్తూ ఒక తీర్మానం చేస్తుంది. ఆయన అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై కేంద్రప్రభుత్వం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పార్లమెంటు ఉభయసభలు కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేసిన తరువాత రేపటికి వాయిదా పడే అవకాశం ఉంది. ఆయన స్వస్థలమయిన రామేశ్వరంలో విషాద చాయాలు అలుముకొన్నాయి. ఆయన మృతికి సంతాపంగా తమిళనాడుతో సహా అనేక రాష్ట్రాలలో విద్యాసంస్థలు ఈరోజు మూసివేసారు.