కరోనా పేరుతో ప్రధాని నరేంద్రమోడీ దేశంలో లాక్ డౌన్ విధించి సరిగ్గా ఏడాది అయింది. గత ఏడాది మార్చి 21వ తేదీన ఆయన జనతా కర్ఫ్యూ ప్రకటించారు. ప్రజలు స్వచ్చందంగా ఇంట్లోనే ఉండాలని పిలుపునిచ్చారు. అప్పటికే కరోనా పై తీవ్రమైన భయాందోళనలు ఉండటంతో ప్రజలు పాటించారు. రైళ్లు, బస్సులు రద్దు చేయడంతో ప్రయాణాలు ఆగిపోయాయి. అదే రోజు సాయంత్రం టీవీల్లో ప్రత్యక్షమైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. దేశప్రజలందర్నీ మిత్రోమ్లుగా అభివర్ణిస్తూ లాక్ డౌన్ ప్రకటించేశారు. అంటే… అధితారికంగా 22న లాక్ డౌన్ అమలు ప్రారంభమైనప్పటికీ.. 21 నుంచి… అమలు చేస్తున్నట్లుగా అనుకోవాలి. హఠాత్తుగా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలి అంటే… సాధ్యమేనా…? ఎన్ని రోజులో తెలియని లాక్ డౌన్‌తో వారు ఎన్ని కష్టాలు పడతారు..? రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఏమైపోతారు వంటి ఆలోచనలు.. ముందస్తు ప్రణాళికలు ఏమీ లేకుండా… లాక్ డౌన్ ప్రకటించేశారు.
లాక్ డౌన్ ప్రకటించిన కొద్ది రోజులు… అందరికీ జాతీయత స్ఫూర్తి పాఠాలు చెప్పారు. దాంతో లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తే… దేశద్రోహం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కానీ.. జాతీయత కడుపు నింపదుగా. కూలీలు రోడ్డు బాట పట్టుకున్నారు. పోలీసులు కనిపించిన వారిని కనిపించినట్లుగా కొట్టినా.. దెబ్బలు తిన్నారు కానీ.. నడవడం వదిలి పెట్టలేదు. రైలు పట్టారు.. రహదార్లు.. ఏది కనిపిస్తే.. దాన్ని పట్టుకుని తమ ఊరి దారి పట్టాలు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధి కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే… ప్రణాళిక లేని లాక్ డౌన్‌తో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
కేంద్రం ప్రజల కష్టాలను చూసి.. రేషన్ మాత్రం ఇచ్చి సరి పెట్టుకుంది. ఎవరికి ఎలాంటి సాయం చేయలేదు. కూలీల కోసం రైళ్లు వేసి చార్జీలు వసూలు చేసింది. ఉపాధి. ఉద్యోగం కోల్పోయిన వారికి పైసా ప్రయోజనం కల్పించలేదు. ఆత్మనిర్భర్ పేరుతో ప్యాకేజీ ప్రకటించి.. ఆ నిధులను మొత్తం… పెట్రోల్, డీజీల్‌పై పన్నులను పెంచడం ద్వారా ప్రజల నుంచి వసూలు చేస్తోంది. ఆ ఆత్మనిర్భర్ ప్యాకేజీతో ప్రజలకు ఒరిగిందేమిటో.. ఎవరికీ తెలియదు. ఇతర దేశాల్లో లాక్ డౌన్ విధించే ముందు ప్రజల గురించి కాస్తంత ఆలోచించారు. కానీ ఇక్కడ మాత్రం లేదు.
ప్రస్తుతం దేశంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి కేసులు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల లాక్ డౌన్ విధిస్తున్నారు. ఆంక్షలు పెడుతున్నారు. ఏమో కేంద్ర ప్రభుత్వం మళ్లీ జాతీయ వాద స్ఫూర్తి కోసం లాక్ డౌన్ ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ఈ దేశంలో ప్రజల కష్టాలనుపట్టించుకునే పాలకులు లేరు. ప్రజల ప్రతీ కష్టాన్ని రాజకీయ లబ్ది కోసం చూసుకునేవారే ఎక్కువ.