నరరూపరాక్షసులు అని ఊరికే చెబితే పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒక్కొక్కరికి రెండు సార్లు ఉరి తీయమని న్యాయమూర్తి వారికి శిక్ష విధించారంటే… వారెంత కర్కోటకులో ఊహించుకోవచ్చు. ఆ కర్కోటకులు మున్నా గ్యాంగ్. వారందరికి… అంటే గ్యాంగ్‌లోని పదకొండు మందికి న్యాయస్థానం ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. వీరిలో ముగ్గుర్ని రెండు సార్లు ఉరి తీయాలని జడ్జి ఆదేశించారు. ఓ సారి ఉరి తీసినా చచ్చిపోతారు. అయినా రెండో సారి కూడా ఉరి తీయమని… న్యాయమూర్తి ఆదేశించారు. ఆ ముఠాని వారందరూ ఆ శిక్షకు అర్హులే.
చెన్నై -కోల్‌కతా జాతీయ రహదారిపై కొన్నాళ్ల కిందట.. ఐరన్ లోడ్‌తో వెళ్లే లారీలు మాయమైపోయేవి. అందులో డ్రైవర్లు, క్లీనర్లు కూడా కనిపించకుండాపోయేవారు. మాయమైపోవడానికి అవేమీ చిన్నా చితకా వాహనాలు కాదు. భారీ లారీలు. మరి ఎలా మాయవుతున్నాయా… అని పోలీసులు పరిశోధన చేస్తే.. మున్నా గ్యాంగ్ గురించి బయటకు వచ్చింది. వారు లారీల్ని టార్గెట్ చేసి.. డ్రైవర్, క్లీనర్లను చంపేసి.. అందులో ఉన్న సరుకుని అమ్మేసి.. లారీని ఏ పార్ట్‌కు ఆ పార్టీ ఊడదీసి తుక్కు కింద అమ్ముకునేవారు. దీంతో అసలు ఆనవాళ్లు కూడా కనిపించేవి కావు. మున్నా గ్యాంగ్ పోలీసు దుస్తులు వేసుకుని హైవేపై వచ్చీపోయే వాహనాలను ఆపేవారు. గ్యాంగ్ సభ్యులు చెకింగ్ పేరుతో లారీలోకి డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు బిగించి అతి కిరాతకంగా హతమార్చేవారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా చంపి గోతాల్లో కుక్కి వాగులో పూడ్చిపెట్టేవారు.
2008లో ఈ దారుణాలు వెలుగు చూశాయి. పోలీసులు చురుగ్గా ఆధారాలు సేకరించారు. కేసు విచారణ పదమూడేళ్ల పాటు సాగింది. ఇందుకు సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది. ఒంగోలు జిల్లా కోర్టు ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి ఉరి శిక్ష విధించింది. వీరిలో ముగ్గురిని రెండుసార్లు ఉరి తీయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.
సస్పెన్స్.. క్రైమ్ ధ్రిల్లర్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని మున్నా గ్యాంగ్ అరాచకాలు.. చివరికి అంతమయ్యాయి. హైవేలపై ఎన్నో రకాల నేరాలు జరుగుతూంటాయి. కానీ.. మున్నా గ్యాంగ్‌ది మాత్రం.. ప్రత్యేకమైన నేరాలు..ఘోరాలు… దానికి తగ్గ శిక్షను వారు ఇప్పుడు అనుభవిస్తున్నారు.