ఒంగోలు లోక్సభ స్థానం అభ్యర్థి ఎంపిక విషయం అధికార టీడీపీతో పాటు వైసీపీ లోనూ ఉత్కంఠను రేపుతుంది. ఎవరు బరిలో నిలుస్తారో అని ఇరు పార్టీల కార్యకర్తలకు కూడా అర్ధం కాని పరిస్ధితి.. టీడీపీలో ప్రధానంగా మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు మరికొందరి పేర్లను పరిశీలిస్తుండగా వైసీపీలో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎప్పుడు చేరతారు..? అసలు చేరతారా లేదా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయడానికి మంత్రి శిద్ధా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దొరికితే ప్రత్యామ్నాయం చూద్దామని లేకపోతే మీరే పోటీ చేయాలని చెప్పి పంపించారు.
ఒంగోలు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో మరికొన్ని పేర్లు కూడా సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. బీద మస్తాన్రావు, మాజీ మంత్రి పాలేటి రామారావు, జడ్పీ మాజీ చైర్మన్ కాటం అరుణమ్మ పేర్లపై పార్టీ నేతలు పరిశీలన చేస్తున్నారు. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు కూడా రెడీ అంటున్నారు. టీడీపీ తరపున తాను పోటీ చేయలేనని చెప్పిన మాగుంట ఇంకా వైసీపీలో చేరకపోవడాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవహారంపై తుది నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. వైసీపీ తరఫున ఒంగోలు అభ్యర్దిగా తానే తిరిగి పోటీ చేస్తానని తాజా మాజీ ఎంపీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి జగన్పై ఒత్తిడి పెంచుతున్నారు. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం మాగుంట పేరు చెబుతున్నారు. కానీ మాగుంట పార్టీలో చేరికపై మాత్రం క్లారిటీ లేదు. ఆయన టీడీపీ నేతగానే రోజువారీ షెడ్యూల్ను కొనసాగిస్తున్నారు.
పార్టీలోకి మాగుంట రాక ఖాయమని వారు చెప్తున్నప్పటికీ మాగుంట మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా నోరు విప్పకపోవడం, ఎప్పుడు చేరతారన్న విషయమై స్పష్టత ఇవ్వకపోవడంతో వారు కొంత అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. మాగుంట మౌనాన్ని అవకాశంగా చేసుకొని తనకే టికెట్టు ఇవ్వాలని వైవీ ఒత్తిడి పెంచుతున్నారు. శుక్రవారం వరకూ వేచి చూసి ఆ తర్వాత ఒంగోలు లోక్సభ అభ్యర్థిని తేల్చాలని జగన్ అనుకుంటున్నారు .