ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని యువకుడి ఆత్మహత్య అనే వార్తలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇవి బయటకు కనిపించేవి ఒక్క శాతమే.. కానీ సమస్య తీవ్రత మాత్రం వంద శాతం ఉంది. స్మార్ట్ ఫోన్ ఉండి.. కాస్త ఈజీ మనీ కోసం ఆశపడే యువకుల్ని ఆశపెట్టి సర్వం పిండేస్తున్నారు. చివరికి బయటపడే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
బెట్టింగ్ యాప్లతో యువతపై వల
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లు లెక్కలేనన్ని పుట్టుకు వచ్చాయి. కొంత మంది విపరీతంగా వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ఊరకనే డబ్బులు వచ్చేస్తాయని ఇందులో ఆశ పెడుతున్నారు. ఫలితంగా..తమ కుటుంబాలకు తెలియకుండా డబ్బులు ఎక్కడెక్కడ నుంచో తెచ్చి బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఫలితంగా సర్వం కోల్పోతున్నారు. నిండా మునిగిపోయిన తర్వాత ఇక వేరే దారి లేదని ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఒక్కరి తప్పుతో కుటుంబం సర్వనాశనం
బెట్టింగ్ అంటే ఒకప్పుడు..కేవలం క్రికెట్ మ్యాచులు జరిగినప్పుడు పెట్టుకుంటారని అనుకునేవారు. కానీ ఇప్పుడు పోటీలతో సంబంధం లేని ఆన్ లైన్ గేమ్స్ నిర్వహించి అందులో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీన్నో వ్యసనంలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లతో … బెట్టింగ్ యాప్ నుంచి సందేశాలు వస్తున్నాయి. మీకు వెయ్యి ఫ్రీ క్యాష్ జమ చేశామని ఆడుకుని డబ్బులు గెల్చుకోవాలని సందేశాలు వస్తూంటాయి. ఇలాంటి మాయలో పడి.. యువత సర్వం కోల్పోతున్నారు.
ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు ?
ఈ బెట్టింగ్ యాప్లు చేస్తున్న నష్టాన్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఫలితంగా అనుమతుల్లేకుండా బెట్టింగ్ యాప్ లు వేలకువేలు పుట్టుకువస్తున్నాయి. వాటికి కొంత మందితో ప్రమోట్ చేయించి.. అమాయకులైన వారి నుంచి వేల కోట్లు పిండుకుని వారి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. నష్టపోయిన వారు ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది.