చిత్రసీమకు శుభవార్త. లాక్ డౌన్ తో కుంగిపోయిన సినిమాకు కాస్త ఉపశమనం. ఇక నుంచి సినిమాలకు సంబంధించిన సెన్సార్ చేసుకోవొచ్చు. ఆన్ లైన్ ద్వారా. లాక్ డౌన్ వల్ల సినిమాలు, షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులూ అన్నీ ఆగిపోయాయి. సినిమాల్ని కనీసం ఓటీటీ ద్వారా విడుదల చేసుకోవాలంటే సెన్సార్ తప్పనిసరి. ఓటీటీ బేరాలు అయిపోయి, సెన్సార్ కాని సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే `కనీసం సెన్సార్ కార్యక్రమాలైనా పూర్తి చేయండి` అంటూ కొంతమంది నిర్మాతలు మొర పెట్టుకున్నారు. దీనిపై జాతీయ సెన్సార్ బోర్డు స్పందించింది. ఆన్ లైన్లో సెన్సార్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది.
ఇది వరకు సెన్సార్ జరగినప్పుడు నిర్మాత సెన్సార్ బోర్డు ముందు హాజరుకావాల్సివుంది. అయితే ఇప్పుడు ఆ నిబంధన సడలించారు. నిర్మాత సౌలభ్యాన్ని బట్టి.. సినిమా ఎక్కడ ప్రదర్శించినా సరే, సెన్సార్ బోర్డు వచ్చి సినిమా చూసి వెళ్తుంది. ఈ మెయిల్ ద్వారా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. హార్డ్ డిస్క్, క్యూబ్ రూపంలో సినిమా పంపినా, సెన్సార్ బోర్డు చూసి,సర్టిఫై చేస్తుంది. హైదరాబాద్ లో ఇక నుంచి ఈ విధానం ద్వారానే సినిమాల్ని సెన్సార్ చేయబోతున్నట్టు సెన్సార్ బోర్డు ప్రాంతియ అధికారి వి. బాలకృష్ణ తెలిపారు.