ఇప్పుడంతా వైరస్ కాలం. బయటకెళతే.. ఎక్కడ కరోనా అంటుకుంటుందో.. తెలియని పరిస్థితి. అందుకే.. అందరూ అన్లైన్లో కొనడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పులు .. పప్పుల దగ్గర్నుంచి వైద్యం కూడా.. ఆన్లైన్లో దొరుకుతోంది. దొరకనిదల్లా.. ఒక్క మద్యమే. అఫ్ కోర్స్.. అనధికారికంగా.. ఫేస్బుక్.. వాట్సాపుల్లో.. లాక్డౌన్ టైమ్‌లో బ్లాక్‌లో అమ్ముకుని ఉంటారు.. కానీ అధికారికంగా మాత్రం ఇప్పుడు అమ్మడం లేదు. ఒక్క సారి మద్యం దుకాణాలు తెరవగానే.. జనం ఎగబడిన దృశ్యాలు చూసి.. సుప్రీంకోర్టుకు కూడా.. ఆశ్చర్యం వేసింది. వాటిపై దాఖలైన పిటిషన్లును పరిశీలించి.. డోర్ డెలివరీ ఆప్షన్‌ను పరిశీలించమని సూచించింది.
ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా మద్యాన్ని సరఫరా చేయడానికి అమెజాన్‌కు పర్మిషన్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అమెజాన్ తో పాటు అలీబాబా వెంచర్ అయిన బిగ్ బాస్కెట్ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి తీసుకుంది. 90 మిలియన్లకు పైగా జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నాల్గవ రాష్ట్రం. ఇంత జనాభా ఉన్న రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే మద్యం ఆన్ లైన్ వ్యాపారం కూడా ఓ మార్గం అని భావించింది ప్రభుత్వం. అమెజాన్, బిగ్ బాస్కెట్లకు కు ఇదో గొప్ప అవకాశంగా మారనుంది.
మద్యం డోర్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చిన మొదటి రాష్ట్రం బెంగాల్ కాదు.. ఈ నిర్ణయాన్ని జార్ఘండ్ నెల క్రితమే తీసుకుంది. ఆన్లైన్ ద్వారా మద్యం హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు మే నెలలోనే ప్రకటించింది. రాంచీ, జంషెడ్పూర్, బొకారో లాంటి 9 పట్టణాల్లో మద్యాన్ని ఇంటికే డెలివరీ చేసేందుకు స్విగ్గీ, జోమాటలతో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 15 జిల్లా కేంద్రాల్లో ఆన్ లైన్ టోకెన్ విధానం ద్వారా షాపుల్లోనూ లిక్కర్‌ను కొనుగోలు చేసే సౌకర్యం కల్పించింది. కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ లో లిక్కర్ బుక్కింగ్ సిస్టమ్ ను అమలుచేస్తోంది. ఇందులో భాగంగా కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ బేవక్యూ అనే యాప్ ను 20 రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చింది. గంటలో ఆ యాప్ ను లక్షమందికి పైగా వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇది త్వరలోనే అందుబాటులోకి రావొచ్చు.