తెలంగాణలో కూడా త్వరలోనే సినిమా టికెట్ల కోసం ఆన్ లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ప్రకటించారు. అయితే ఏపీ తరహాలో బలవంతంగా ఏదీ చేయబోమని.. అందరితో మాట్లాడి..అందరి అంగీకారం తర్వాతే చేస్తామని ఆయన చెబుతున్నారు. సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రభుత్వం బలవంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని ఆయన హామీ ఇచ్చారు. సందర్భాన్ని బట్టే ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని అన్నారు.
ప్రస్తుత కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు మరింత గట్టింగా కనుక ఉంటే మళ్లీ థియేటర్లపై ఆంక్షలు తప్పవని తలసాని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే వంద శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్లు ఇచ్చామన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఏపీలో సినిమా థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో తాను మాట్లాడతానని సినీ పరిశ్రమ పెద్దలకు భరోసా ఇచ్చారు.
సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని.. అఖండ, పుష్ప చిత్రాలతో పరిశ్రమకు ఊరట లభించిందన్నారు. పరిశ్రమను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే తెలంగాణలో టికెట్ ధరలు పెంచేందుకు అనుమతించామని, అంతేకాక, ఐదో ఆటకు కూడా అనుమతి ఇచ్చామని తెలిపారు. తలసాని చెప్పిన పోర్టర్ ఏపీ తరహాలో ఉండదని.. అన్నింటితో పాటు ఒకపోర్టల్లాగా ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ మంత్రులతో సమస్యపై మాట్లాడతానని చెప్పడంతో ఆయన మధ్యవర్తిత్వం చేస్తారేమోనన్న చర్చ జరుగుతోంది.