హైదరాబాద్ నగరంలో అత్యంత తక్కువగా కేవలం 27 శాతం పోలింగ్ నమోదైంది. జూబ్లీ హిల్స్ లాంటి చోట్ల ఒక బూత్ లో వెయ్యి ఓట్లు ఉంటే, కేవలం రెండు వందల అరవై ఓట్లు మాత్రమే ఇప్పటి దాక పోల్ అయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కొన్ని పోలింగ్ బూత్‌లలో ఓటర్ల కంటే పోలీసులు ఎక్కువ గా కనిపిస్తున్నారు. అయితే దీనికి పలు రకాల కారణాలు కనిపిస్తున్నాయి.
మొదటిది – హైదరాబాద్ జనాభా లో చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ కి కూడా ఎన్నికల జరుగుతుండడంతో, వేలాది మంది గత రెండు మూడు రోజుల లో హైదరాబాదు నుండి తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడ ఓటు వేస్తున్నారు. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఇక అసెంబ్లీ ఎన్నికల సమయం తో పోలిస్తే హైదరాబాద్‌లో ఇప్పుడు ఓటింగ్ తగ్గడానికి మరొక కారణం కూడా కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలోనే ఉన్న వారిలో చాలా మంది, తెలంగాణలో ఓటు వేయడం మీద తమకు ఆసక్తి పోయిందని అంటున్నారు. ఎవరికి ఓటు వేసినా, గెలిచిన అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినా అవుతాడు లేదంటే గెలిచిన తర్వాత వెళ్లి టీఆర్ఎస్ పార్టీలో అయినా చేరుతాడు. ఈ మాత్రానికి ఓటు వేయడం ఎందుకని ఒక నిర్వేదాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాలలో 88 స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించి నప్పటికీ, అక్కడికీ ఆశ చావక మిగిలిన ఆ కొద్ది మంది ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ టిఆర్ఎస్ లో చేర్చుకోవడం కారణంగా ప్రజల లో వచ్చిన అనాసక్తి ఇది.
ఇక మూడవ కారణం- సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే ప్రభుత్వ సానుకూలత విపరీతంగా ఉన్నప్పుడు పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే ఈ రెండు ఎక్స్ట్రీమ్ పరిస్థితులు లేకపోవడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.
ఏదిఏమైనా ప్రస్తుత మాత్రం హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం తగ్గడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.