వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై.. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఆరు వారాల తర్వాతే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి.. తదుపరి కార్యచరణ చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం… స్థానిక ఎన్నికల వాయిదాను సమర్థించినట్లయింది. అంటే.. ఇప్పుడల్లా మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఆరు వారాల తర్వాత కరోనా పరిస్థితిని అంచనా వేసి.. దానికి తగ్గట్లుగానే… నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ విషయంలో.. ప్రభుత్వానికి కూడా ఊరట లభించినట్లయింది. ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగించవచ్చని.. ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త పథకాలు ప్రవేశ పెట్టవద్దని ఆదేశించింది.
ప్రస్తుతం ఉన్న పథకాల విషయంలో.. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అమలు చేసుకోవచ్చని తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించే ముందు.. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎలాగైనా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఏపీ సర్కార్ కు ప్రస్తుత తీర్పు ఇబ్బందికరంగానే మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేలిపోయింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశకు చేరింది. కేంద్రం జాతీయ స్థాయిలో విపత్తుగా ప్రకటించింది. ఈ విపత్తు అలర్ట్‌ను కేంద్రం తొలగించిన తర్వాతే.. ఎన్నికల నిర్వహణకు అవకాశం ఏర్పడుతుంది. నిజానికి ఎన్నికల సంఘం విధుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా జోక్యం చేసుకోవని.. నిపుణులు.. రెండురోజులుగా చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి.. అసలు.. ఎస్ఈసీకి ఏ అధికారాలు లేవని వాదిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టుకే వెళ్లారు.
అయితే.. ఎన్నికల కోడ్ ఎత్తి వేయడంతో.. ఇప్పుడు అధికారుల్ని బదిలీ చేయాలా.. వద్దా అన్నదానిపై సందిగ్ధత ఉంది. ఇప్పటికే… ఎన్నికల కమిషన్ ఆదేశాలను 24 గంటల్లో అమలు చేయాల్సి ఉంటుంది. మూడు రోజులైనా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ..ఆ ఆదేశాలను అమలు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో.. ఎస్ఈసీ స్పందన ఎలా ఉంటుంది..? సీఎస్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
సుప్రీం తీర్పు.. ! పార్టీకి షాకే.. కానీ ప్రభుత్వానికి స్వీట్ న్యూసే..!
స్థానిక ఎన్నికలను నిర్వహించాలనే విషయంలో ఏపీ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలినప్పటికీ.. ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం ఆటంకాలు లేకుండా చూసుకోవడంలో… ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఉగాదికి ఇరవై ఆరు లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి దీన్నో మిషన్ గా పెట్టుకుని అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. అనూహ్యంగా ఉగాది నెలలలోనే అదీ కూడా.. ఉగాది పండుగ వచ్చినప్పుడే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో.. ఆ ప్రక్రియ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటర్లకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం అంటే.. ఖచ్చితంగా ఓటర్లను ప్రలోభ పెట్టినట్లేనన్న అభిప్రాయంతో స్టేట్ ఎలక్షన్ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించింది.
అనూహ్యంగా ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడటం.. కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేయడంతో… ఇళ్ల స్థలాల పంపిణీ జరగదని అందరూ అనకున్నారు. కానీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా కోడ్ లేకుండా నిర్ణయం తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో.. ఉగాది రోజున.. ఇరవై ఆరు లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఉండనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటినీ అమలు చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. బడ్జెట్లో.. పాత పథకాలే కాబట్టి.. మార్చి నుంచి మళ్లీ నవరత్నాల అమలును ప్రారంభించడానికి కూడా అవకాశం ఏర్పడింది. టైలర్లకు.. ఇతరులకు ఆర్థిక సాయం కూడా చేయవచ్చు.
ఇవన్నీ పాత పథకాలే. మళ్లీ మేలో.. రైతులకు రైతు భరోసా కింద… నిధులను కూడా పంపిణీ చేయవచ్చు. సంక్షేమ రంగంలో.. ఎలాంటి చిన్న చిన్న లోపాలు కూడా రాకుండా.. ప్రజలకు ఫలాలు పంచాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్ణయం… ఊరటనిచ్చిందనే చెప్పారు. అంటే.. పార్టీ పరంగా.. ఎన్నికల నిర్వహణ ఈసీ ఇష్టం చెప్పడం ఎదురుదెబ్బ కావొచ్చు కానీ.. ప్రభుత్వ పరంగా మాత్రం… మంచి విజయమే దక్కిందని చెప్పాలి.