హుజురాబాద్ ఉపఎన్నికలో అభ్యర్థి ఎన్నిక, వ్యూహాలు, ప్రచారం సహా మొత్తం ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహదేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడినా ఆయన ఎప్పట్లాగే రాజకీయాలపై చాలా మాట్లాడారు కానీ.. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎందుకు అంటీ ముట్టనట్లుగా ఉన్నారన్నదానిపై ఆయన సూటిగానే స్పందించారు. ఆ ఉపఎన్నిక బాధ్యత వంద శాతం దామోదర రాజనర్సింహదేనని స్పష్టం చేశారు. ఉపఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయనే అభ్యర్థి సహా అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హుజూరాబాద్‌కు ఇంచార్జ్‌గా దామోదరను నియమించారు. అయితే పీసీసీ చీఫ్ అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పెద్దగా అటు వైపు దృష్టి సారించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ హోప్స్ వదిలేసుకుందన్న ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థి ఎంపికైనా మీనమేషాలు లెక్కిస్తూండటంతో.. ఈటలను గెలిపించేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎవరినో ఎందుకు గెలిపిస్తామని ఉపఎన్నికల బాధ్యత దామోదర తీసుకున్నారని చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ లో ఎలాంటి ఫలితం వచ్చినా తర్వాత తనపై బాధ్యత పడకుండా వ్యూహాత్మకంగా రేవంత్ తప్పించుకుంటున్న ప్రచారం కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లోనూ జరుగుతోంది.
రేవంత్ పైకి అ మాట చెప్పినా అభ్యర్థిగా కొండా సురేఖను తెరపైకి తీసుకు రావడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. బలమైన అభ్యర్థి హుజూరాబాద్‌లో లేకపోవడం కనీసం తమ ఓటు బ్యాంకునైనా ఇతర పార్టీలకు వెళ్లకుండా కాపాడుకునే లక్ష్యంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఉపఎన్నికల బాధ్యత తీసుకున్న దామోదర… తన నివేదికను హైకమాండ్‌కు కూడా ఇప్పగించారు. అందులో కొండా సురేఖతో పాటు ముగ్గురు పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాను పంపారు. హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.