నవనిర్మాణ దీక్ష.. ప్రతి ఒక్కకరిని హర్షింపజేసి, మెప్పింపజేసే దీక్ష. బతుకులు బాగుపడతాయంటే ఎవరు మాత్రం కాదనరు. సంగీతాలాపానకు శ్రుతిలయలు ఎంత ప్రధానమో మిగిలిన అంశాలకూ శ్రద్ధాశక్తులూ అంతే ముఖ్యం. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నవంబరు ఒకటో తేదీన అయితే..జూన్ 2వ తేదీకి మార్చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ తప్ప ఆంధ్ర ప్రదేశ్ కాదు. ఏపీకి రాజధానొకటే లేదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో కూడా తెలంగాణను కొత్త రాష్ట్రంగా పేర్కొంది తప్ప ఆంధ్ర ప్రదేశ్‌ను కాదు. పొట్టి శ్రీరాములు దీక్షా ఫలితాన్ని పక్కన పెట్టేశారు.
ముఖ్యమంత్రిగారు చెబుతున్నట్లు నవనిర్మాణ దీక్షను ఏపీకి దుర్దినమైన జూన్ 2న చేపట్టుకోవచ్చు. ఎందుకంటే అది నీడ కూడా లేకుండా పోయిందన్న కసి, అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ప్రతి ఆంధ్రుడిలోనూ పుట్టినరోజిది. వాటిని తీర్చుకోవాలంటే ఏదో ఒకటి చేయక తప్పదు. అందుకోసం, నవనిర్మాణ దీక్ష పేరుతో దీక్ష దీక్షుల్ని చేయడం ఎంతమాత్రం తప్పు కాదు. దీక్ష.. మహా సంకల్పంతో ముగుస్తుంది. తొలి, తుది రోజులలో ముఖ్యమంత్రి గారి సుదీర్ఘ ఉపన్యాసాలు పార్టీ కార్యకర్తలలో అద్భుతమైన స్ఫూర్తిని నింపుతాయి. రోజుకో రంగాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన దీక్ష అభినందించదగ్గదే.
దీనికి ముందు ఒక్కసారి చంద్రబాబుగారు 2003లో విరచించుకున్న 2020 లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటే మేలు. ఆ తరువాత ఆయన పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత 2020ని అశ్రద్ధ చేశారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 20ఏళ్ళ ప్రణాళిక బదులు ఇప్పుడు 30ఏళ్ళ ప్రణాళికను తయారు చేశారు. అందుకనుగుణంగా లక్ష్యాలు పెట్టుకున్నారు. ఇందులో ప్రధానమైనవి ఏపీ ఎదుగుదల.. తలసరి ఆదాయం పెంపు. ఇవి నెరవేరితే అంతకుమించి కావలసినదేముంది. బికామ్‌లో ఫిజిక్స్ చదివానని చెప్పుకునే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే ఇలాంటివి సిద్ధిస్తాయా.. ఆలోచించుకోవాలి. ఇంతవరకూ ప్రతిపక్షాన్ని ఎలా బలహీన పరచాలనే అంశంపైనే దృష్టి సారించారు. జూన్ 2వ తేదీ రాగానే దీక్షలు, మహా సంకల్పాలూ గుర్తుకొస్తాయి. మిమ్మల్ని నిద్రపోనివ్వను.. నేను నిద్ర పోనివ్వను అంటూ తరచూ హుంకరించే ముఖ్యమంత్రి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. హిరణ్యకశిపుడు తరచూ విష్ణునామాన్ని జపించినట్లు.. ప్రతిపక్ష నామాన్ని పలకడం మానాలి. పివి సింధుపై ఎలా కరుణ చూపించారో… అలాగే, ఒకప్పుడు దేశానికి ఖ్యాతి తెచ్చి, ఇప్పుడు ఇక్కట్లలో ఉన్న పూజారి శైలజ వంటి క్రీడాకారులనూ ఆదుకునేందుకు నడుం బిగించాలి. అందర్నీ సమానంగా చూసినప్పుడే.. రాష్ట్రాధినేతకు మంచి పేరొస్తుంది. దీక్షలకు సాఫల్యమేర్పడుతుంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి