ఆగస్టు 1 నుంచి షూటింగులు బంద్ చేస్తారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఈ విషయమై… నిర్మాతలంతా సమావేశమై వాడీ వేడీగా చర్చించుకొంటున్నారు. పెరిగిపోతున్న నిర్మాణ వ్యయాన్ని అదుపులో పెట్టాలంటే, కొన్ని రోజుల పాటు షూటింగులు ఆపేసి, నటీనటులతో, సాంకేతిక నిపుణులతో, 24 విభాగాల సంఘాలతో చర్చించి, సమస్యల్ని పరిష్కరించుకోవాలన్నది నిర్మాతల ఉద్దేశం. ఇందుకోసమే.. నిర్మాతలంతా పలు దఫాలుగా చర్చించారు. కానీ.. ఇప్పటి వరకూ నిర్మాతల్లో ఏకాభిప్రాయం రాలేదు. షూటింగులు ఆపేయడం వల్ల.. సమస్యలు పరిష్కారం అవ్వవని, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని కొంతమంది నిర్మాతల వాదన. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని… నిర్మాతలు అడుగుతున్నారు. అయితే దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలలైతే, షూటింగులు ఆపేస్తే తప్ప, సమస్య తీవ్రత అర్థం కాదని వాదిస్తున్నారని తెలుస్తోంది. దీనిపైనే తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఆగస్టు 1 నుంచి కాకపోయినా, ఆగస్టు 15 నుంచైనా కొన్ని సినిమాలు షూటింగులు ఆగిపోవడం ఖాయం. ముఖ్యంగా అగ్ర నిర్మాతలు కొంతమంది తమ సినిమాల షూటింగుల్ని నిలిపేస్తారని తెలుస్తోంది. సినిమా షూటింగులు ఆపాలా, వద్దా? అనేది నిర్మాతల వ్యక్తిగత నిర్ణయానికే వదిలేశారని సమాచారం.
ఓటీటీ విషయంలోనూ భిన్నాభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. చిన్న సినిమాలైతే 4 వారాల తరవాత ఓటీటీకి ఇచ్చుకోవచ్చని, పెద్ద సినిమాలైతే 10 వారాలు ఆగాల్సిందేనని కొంతమంది నిర్మాతలు అంటున్నారు. అయితే పది వారాలైతే, ఓటీటీలు అడిగినంత రేటు ఇవ్వవని, అందుకే దాన్ని ఆరు వారాలకు కుదించాలన్నది ఇంకొంతమంది నిర్మాతల అభిప్రాయం. కొన్ని రోజులుగా నిర్మాతల సమస్యలపై చర్చ జరుగుతున్నా ఎవరూ ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారు. అందుకే 27 మంది సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని, అసలు ఇండస్ట్రీలో సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కంచాలి? అనే విషయంపై కూలంకుశంగా చర్చించి, ఓ నివేదిక ఇవ్వాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించుకొంది. బుధవారం మరో కీలకమైన సమావేశం జరగబోతోంది. ఇందులో కమిటీలో ఎవరెవరు ఉంటారు? అనే విషయంలో ఓ స్పష్టత వస్తుంది.