బీజేపీని ప్రశ్నించిన వారిని విదేశీయులని నిందించడం కామన్‌గా మారిపోయింది. ఆ వైరస్ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ పాకిపోయింది. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి హీరో సిద్ధార్థ్‌ను .. బయట వ్యక్తిగా చెబుతున్నారు. హీరో సిద్ధార్థ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆయన భావజాలం ఫక్తు భిన్నం. పదే పదే విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ కొత్త భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నం ఎదుట హిందూ పద్దతిలో పూజలు చేయడాన్ని ప్రశ్నిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ఒక వేళ ఉప రాష్ట్రపతిగా హమీద్ అన్సారీ ఉండి ముస్లిం పద్దతిలో పూజలు చేసినట్లయితే బీజేపీ నేతలు ఎలా స్పందించేవారోనని ఆయన ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు విష్ణువర్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు సిద్ధార్థ్ ఇండియన్ సిటిజన్ కాదని ఈ అమెరికా పౌరుడిగా భారత అంతర్గత విషయాలపై అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడ్ని బైబిల్ పట్టుకోవడంపై ఎప్పుడైనా ప్రశ్నించారా అని కౌంటర్ ఇచ్చారు. దీనికి సిద్ధార్థ్ కూడా రిప్లయ్ ఇచ్చారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయంపై కాకుండా తాను వేసిన సింపుల్ ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన రిప్లయ్ ఇచ్చారు.
సిద్ధార్ధ , విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య ట్విట్టర్ వాగ్వాదం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది సిద్దార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్ చేశారు. అప్పట్లో సిద్ధార్థ్ కూడా కౌంటర్ ఇచ్చారు. అయినా బీజేపీ నేతలు అడిగిన దానికి కాకుండా… ప్రశ్నిస్తే నచ్చకపోతే పాకిస్తాన్ పో..నువ్ విదేశీయుడివి అంటూ కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు . అదే కోవలో విష్ణువర్ధన్ రెడ్డి కూడా పయనిస్తున్నారు.