ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. కేంద్రంలో ఉన్న నరేంద్రమోడీ సర్కారును ఆరెస్సెస్ వెనుకనుంచి నడిపిస్తూ ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని మోడీ దళం కూడా ఒప్పుకుంటూనే ఉంటారు.
అలాంటి ఆరెస్సెస్ దేశం పట్ల కూడా బాధ్యతగానే వ్యవహరించాలి. దేశ సమగ్రతను కించపరిచే పిదప బుద్ధులను వారు ప్రదర్శించకూడదు. తమ మాటలు మత విద్వేషాలను పెంచేలా ఉండకూడదని గుర్తు పెట్టుకోవాలి. తమ చేతలు మత సహనం పరంగా అందరికీ ఆదర్శంగా ఉండేలా చూసుకోవాలి. కానీ వారి వైఖరి మాత్రం ఎన్నటికీ అలా ఉండడం లేదు.
ఏదో ముస్లింలు, క్రిస్టియన్లు తమ సమావేశాలకు ఆహ్వానించిన అతి కొద్ది సందర్భాల్లో తప్ప, మత సహనం ప్రతిబింబించేలా వారి వ్యాఖ్యలు ఉండడం లేదు. తాజాగా అనంతపురంజిల్లాలోని దృష్టాంతం కూడా ఆరెస్సెస్ నాయకుల మత అసహనానికి నిదర్శనంగానే నిలుస్తోంది.
అనంతపురంలో ఆరెస్సెస్ కార్యకర్తలకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి సంఘ చీఫ్ మోహన్ భగత్ హాజరు అవుతారట. ఆ సందర్భంగా రెండురోజుల పాటూ అనంతపురంలోనే ఉంటారుట. అందులో విశేషం ఏమీ లేదు గానీ.. ఆయన రాక సందర్భంగా బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసులను మతం జల్లెడలోంచి వడపోసి.. హిందువులను మాత్రమే భద్రత ఏర్పాట్లకు అనుమతించడం స్థానిక భాజపా, ఆరెస్సెస్ నేతల అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
మోహన్ భగత్ రాక సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం రైల్వేస్టేషన్ వద్ద భద్రతకు 40 మంది పోలీసులను పంపారు. అయితే ఆ పోలీసులకు ఉండే నేమ్బ్యాడ్జీలను పరిశీలించి, అందులో ముస్లింలు ఎవ్వరూ భద్రత విధుల్లో ఉండరాదంటూ స్థానిక ఆరెస్సెస్ నేతలు హుకుం జారీ చేశారుట. వచ్చిన మొత్తం 40 మందిలో ఆరుగురు ముస్లింలను ఏరి వేసి, వారిని వెనక్కు పంపేసినట్లుగా స్థానికంగా వార్తలు వచ్చాయి. దేశాన్ని నడిపించే మోడీ సర్కారును నడిపించే- ఆరెస్సెస్ నాయకులలో ఇంత విపరీత స్థాయిలో పరమత అసహనం మరియు అహంకారం ఉంటే ఎలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.