జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రజా పోరాట యాత్ర విజయనగరం జిల్లా బొబ్బిలి చేరుకుంది. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ చాలా అంశాలు మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ… ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వరూ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ జగపతి రాజు గురించి మాట్లాడుతూ.. ఆయన అంటే తనకు చాలా గౌరవమనీ, కానీ పవన్ కల్యాణ్ అంటే ఎవరో తనకు తెలీదని గతంలో ఓసారి అన్నారని గుర్తుచేశారు. అయినా, తాను బాధపడలేదనీ, మనసులో ఎక్కడో కాస్త చివుక్కుమందని పవన్ అన్నారు. ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు నాయుడి ప్రయత్నలోపం ఉందని విమర్శించారు.
నేటి రాజకీయాల్లో దమ్మున్నోళ్లు అవసరముందనీ, నిలదీసేవాళ్లు కావాలి, మాట మార్చేవాళ్లు కాదన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందనీ, మరోసారి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారన్నారు. 2014లో మీకు పవన్ నిలబడ్డాడడనీ, మీకు అండగా జనసైన్యం నిలబడిందన్నారు. అయినా, ఏం చేశారని నిలదీశారు. ఇలాంటి ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలా అని ప్రశ్నించారు. మేం ఇవ్వం అన్నారు. జనసేన పార్టీ లేకుండా ఉంటే.. ఉద్దానం కిడ్నీ సమస్యగానీ, ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడేవారు లేకుండేవారన్నారు. ఉన్న రెండు పార్టీలూ పదవులు మాత్రమే పంచుకుంటున్నాయన్నారు.
బొబ్బిలిలో జూట్ మిల్లు సమస్య ఉందనీ, దీని గురించి అధికార ప్రతిపక్షాలు మాట్లాడవన్నారు. జనసేన మాత్రమే మాట్లాడాలి అన్నారు. చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వడం లేదనీ, దీని గురించి ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు. అంతకుముందు, కురుపాంలో మాట్లాడుతూ… అక్కడ మంచినీటి సమస్య గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదనీ, జనసేన మాత్రమే పోరాటం చేస్తోందన్నారు. తెలుగుదేశంగానీ, వైకాపాగానీ ఇలాంటి ప్రజల సమస్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదనీ, కేవలం జనసేన మాత్రమే ప్రజల పక్షాన మాట్లాడుతోందని పవన్ చెప్పారు.
స్థానిక సమస్యల్ని ప్రధానంగా ప్రస్థావిస్తూ పవన్ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాపోరాట యాత్ర ప్రారంభం నుంచి అదే పంథాను పవన్ అనుసరిస్తున్నారు. అయితే, ఈ సమస్యలపై పవన్ స్పందిస్తున్నది కూడా ఇదే తొలిసారి కదా. మంచిదే, కానీ సమస్యలను లేవనెత్తడానికి మాత్రమే పరిమితం కాకుండా, వాటికంటూ పరిష్కార మార్గాలు చూపే వరకూ పవన్ ఇదే ఊపును కొనసాగిస్తే బాగుంటుంది.