నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. వేదిక అతిథులతో నిండిపోతే, ఆడిటోరియం ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు ఓ తీపి కానుక. అయితే ఈ గ్యాంగ్ లో నాగార్జున మాత్రం మిస్ అయ్యాడు. నాగార్జున కూడా వచ్చి ఉండుంటే… ఓతరం హీరోలందరినీ ఇలా ఒకే వేదికపై చూసే అవకాశం దక్కేది. ఇలాంటి కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం నాగ్ కు కొత్తేం కాదు. బాలయ్య 100వ సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అప్పుడు కూడా నాగ్ రాలేదు. అక్కినేని – నందమూరి ఫ్యామిలీ ఇది వరకు బాగా సఖ్యతగా ఉండేది. ఎన్టీఆర్ – ఏఎన్నార్ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య – నాగ్ కూడా ముందు అలానే ఉండేవారు. కానీ రాను రాను గ్యాప్ పెరుగుతూ వచ్చింది. దాన్ని తగ్గించుకొనే అవకాశం ఎప్పుడు వచ్చినా నాగ్ వదులుకొంటూనే ఉన్నాడు. అందుకే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలే సాక్ష్యం. ఈ కార్యక్రమానికి రావాలని నాగ్ కు ఆహ్వానం అందింది. అఖిల్ పేరు కూడా హాజరవుతున్న అతిథుల జాబితాలో ఉంది. కానీ చివరి నిమిషంలో అఖిల్ కూడా రాలేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్కరొచ్చినా బాగుండేది. కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి రాలేదు. కానీ ఓ వీడియో బైట్ విడుదల చేశాడు. నాగ్ కనీసం అది కూడా చేయలేదు.
అల్లు అర్జున్ కూడా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టాడు. ఆయన కూడా చివరి క్షణం వరకూ ‘వస్తాను.. వస్తాను’ అంటూ నిర్వాహకుల్ని ఊరిస్తూనే వచ్చాడు. కానీ రాలేదు. ఇక ఎన్టీఆర్ గురించి సరే సరి. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఈ కార్యక్రమానికి రావట్లేదని ముందే తెలిసిపోయింది. నింద తనవైపు రాకుండా ఎన్టీఆర్ కర్ణాటకలోని దేవాలయాల సందర్శనకు వెళ్లిపోయాడు. ‘బాబాయ్ పోగ్రాంకు ఎందుకు రాలేదు’ అని అడిగితే… ‘టెంపుల్ టూర్’ గురించి చెప్పేయొచ్చు. అదీ ఎన్టీఆర్ ముందస్తు వ్యూహం కావొచ్చు. అయితే బాలయ్య పోగ్రాం సెప్టెంబరు 1న జరగబోతోంది అనేది నెల రోజుల ముందే ఫిక్సయ్యింది. కావాలంటే బాలయ్య పోగ్రాం అయ్యాకే టెంపుల్ టూర్ పెట్టుకోవొచ్చు. ఎన్టీఆర్ సరే.. మరి కల్యాణ్ రామ్ ఎక్కడికి వెళ్లినట్టు?