కళా వెంకట్రావు అరెస్ట్ వ్యవహారం బూమరాంగ్ అయినట్లుగా వైసీపీ నేతలు మథనపడుతన్నారు. ఆయనను అరెస్ట్ చేసిన దృశ్యాలు మీడియాలో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత వరకూ ఎలాంటి వివాదాల్లో లేని ఓ రాజకీయ నేతను ఇంత దారుణంగా పోలీసులు ట్రీట్ చేయడంపై ” ఫ్యాక్షన్ పాలన” అంటే ఇదేనేమో అన్న అభిప్రాయం కల్పించిందన్న ఆందోళన.. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతల్లో ప్రారంభమయింది. అరెస్టయిన కాసేపటికే ఆ రియాక్షన్ తెలియడంతో వెంటనే.. ప్రభుత్వ పెద్దలు ప్లాన్ మార్చేశారు. గంటన్నరలోనే చీపురుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. వెంటనే.. ఆయనను అరెస్ట్ చేయలేదని .. కేవలం నోటీసులు ఇచ్చేందుకు పిలిచామని కవర్ చేసుకోవడం ప్రారంభించారు.
ఈ ఘటనపై ఉదయమే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి డీజీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీజీపీకి కనీసం మానసిక పరివర్తన కూడా లేదని మండిపడ్డారు. ఆ తర్వాత వెంటనే ప్రెస్మీట్ పెట్టిన..సజ్జల రామకృష్ణారెడ్డి .. కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు. హోంమంత్రి, డీజీపీ అధికారాలు మొత్తం సూపర్ పవర్ గా ఆయనే చెలాయిస్తారన్న ప్రచారం ఉంది. ఈ తరుణంలో సజ్జల కళా వెంకట్రావును అరెస్ట్ చేయలేదని… చట్టం గురించి తెలుసుకోవాలన్నట్లుగా సజ్జల కవర్ చేసుకున్నారు. కళా వెంకట్రావుకు నోటీసులు ఇవ్వడానికి.. వివరాలు తెలుసుకోవడానికే పోలీసులు పిలిచారని కవర్ చేస్తున్నారు.
విచారణకు పిలవడానికి … వందల మంది పోలీసులతో ఇంటిపై పడి.. తీసుకెళ్లడానికి ప్రజలెవరికి తేడా తెలియదని సజ్జల అనుకుంటున్నట్లుగా ఉంది. మొత్తానికి కళా వెంకట్రావు అరెస్ట్ వ్యవహారంలో నిర్ణయం ఎవరు తీసుకున్నారో కానీ.. వెంటనే రివర్స్ అయింది. అరెస్ట్ చేయలేదని… కేవలం ప్రశ్నించడానికి తీసుకెళ్లారని చెప్పుకొస్తున్నారు. కానీ స్టేషన్ బెయిల్ మీద పంపినట్లుగా పోలీసులే బుధవారం వార్త ప్రకటించారు. ఈ వ్యవహారం ఇంతటితో ఆగేలా లేదన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది.