వైఎస్ ప్యామిలీ రెండుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వర్థంతి సందర్భంగా పులివెందులలో చాలా మంది కుటుంబసభ్యులు హాజరు కాలేదు. వైఎస్ విజయమ్మతో పాటు షర్మిల, వైఎస్ సునీతతో పాటు మరికొంత మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. గత ఏడాది వైఎస్ వివేకా వర్థంతికి ప్రత్యేకంగా పులివెందుల వచ్చి విగ్రహావిష్కరణ చేసి నివాళులు అర్పించి వెళ్లారు. ఆయన వస్తే కుటుంబం అంతా తరలి వస్తుంది. అయితే ఈ సారి జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఆయన సతీమణి భారతీరెడ్డి కూడా రాలేదు. చాలా కాలంగా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనని షర్మిల మాత్రం.. వైఎస్ వివేకానందరెడ్డి వర్థంతికి ప్రత్యేకంగా పులివెందుల వచ్చారు.
తల్లితో కలిసి వచ్చిన ఆమె.. వివేకానందరెడ్డి కుమార్తెతో కలిసి నివాళులు అర్పించారు. మామూలుగా అయితే ఈ కుటుంబకార్యక్రమంలో ఇతరులు పాల్గొనకపోయినా పట్టించుకోరు కానీ.. ప్రస్తుతం షర్మిల సొంత పార్టీ పెట్టుకుని తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు. అన్న జగన్ తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని.. పదవులు ఇవ్వలేదని బహిరంగంగానే చెబుతున్నారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టడం అన్నకు ఇష్టం లేదని కూడా ఆమె చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో పులివెందుల పర్యటనలో ఆమె వెంట ఎవరుంటారన్న చర్చ జరిగింది. వైఎస్ వివేకా కుమార్తె. తల్లి విజయలక్ష్మి తప్ప దాదాపుగా ఎవరూ లేరు.
ఇటీవలి కాలంలో క్రిస్మస్తో పాటు.. వైఎస్ వర్థంతి, జయంతి కార్యక్రమాలకు అందరితో పాటు వచ్చి షర్మిల నివాళులు అర్పించలేకపోయారు. ఈ కారణంగా వైఎస్ సమాధి వద్ద ఒంటరిగా కాసేపు మౌనంగా నివాళి అర్పించారు. ఈ పరిణామాలన్నీ.. చూస్తే.. వైఎస్ కుటుంబసభ్యులల్లో చీలిక వచ్చిందని … పులివెందులలో ప్రచారం జరుగుతోంది.