ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు ఏపీ నుంచి ఎవరెవరు ప్రమాణం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికి ఇద్దరు పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. అందరూ ఊహించినట్లుగా శ్రీకాకుళం ఎంపీ, ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ ఇద్దరు మాత్రం కన్ఫర్మ్ అయ్యారు. మిగతా వారిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి… ఎవరెవరికి ఇవ్వాలన్న విషయాలను పూర్తిగా మోదీకే అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కసరత్తు చేసిన బీజేపీ హైకమాండ్.. ఏపీ నుంచి జనసేన , బీజేపీ తరపున గెలిచిన వారిలో ప్రమాణ స్వీకారానికి ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. టీడీపీకి మరో రెండు కేంద్ర మంత్రి పదవులు , డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఉందని అంటున్నారు. వాటిపై తర్వాత క్లారిటీ రావాల్సి ఉంది.
గత ఐదేళ్లలో ఏపీ నుంచి ఒక్క కేంద్ర మంత్రి కూడా లేరు. దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక్క ఏపీకే లేరు. బీజేపీకి ఎంపీలు లేకపోవడం… జీవీఎల్ లాంటి వాళ్లు కేపబుల్ కాకపోవడంతో ఇవ్వలేదు. ఈ సారి మాత్రం… ఏపీ నుంచి ఐదారుగురు కేంద్ర మంత్రులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అనావృష్టి..లేకపోతే అతివృష్టి అన్నట్లుగా మారిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.