తీవ్ర సంచలనం కలిగించిన తుని విధ్వంసం ఘటనలో దాదాపు నలభై మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ప్రభుత్వానికి కాపునేతలకూ మధ్య ఘర్షణ మరోసారి తీవ్రరూపం తీసుకుంటున్నది. ఏకంగా కడపలోనే అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వం కుట్ర అక్కడే జరిగిందని నిరూపించేందుకు సిద్ధమవుతున్నదా?ముద్రగడ హైదరాబాదు వచ్చి దాసరి నారాయణరావు, చిరంజీవి వంటి వారిని కలసి వెళ్లడం, వారు గట్టిగా మద్దతు తెల్పడంతో తెలుగుదేశం కూడా ఎదురుదాడి పెంచింది. తిరుపతి మహానాడులో ఒకటికి రెండుసార్లు దీనిపై చర్చ తీసుకురావడమే గాక చిరంజీవిని మరీ మరీ ప్రస్తావించడం అందరూ గమనించారు.ఇటీవలి కాలంలో క్రియాశీల రాజకీయాలు తగ్గించి సినిమాలో మునిగితేలుతున్న చిరంజీవిని అంతగా విమర్శించడంలో తెలుగుదేశం దూరదృష్టితోనే వ్యవహరిస్తున్నట్టు అర్థమైంది. ఆయన కూడా కాపు రిజర్వేషన్ల ఆందోళనకు మద్దతు ప్రకటించడం ద్వారా తన సామాజిక పునాదిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఒకవైపున పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు, ఆయన ఆధారంగా బిజెపి ఆశలు వీటి నేపథ్యంలో కాపుల సమస్యను తేలిగ్గా తీసుకోరాదని తెలుగుదేశం నిర్ణయించుకుంది. గట్టి వైఖరి తీసుకోవడం ద్వారా వారిలో కొంత వ్యతిరేకత వచ్చినా తనకున్న నికరమైన బలాన్ని కాపాడుకోవడం, విధ్వంసకాండకు బాధ్యతను మోపడం ద్వారా ఎదురు దాడి చేయడం, దీనంతటినీ వైసీపీపై రాజకీయ దాడికి వాడుకోవడం తెలుగుదేశం వ్యూహం కావచ్చు. అంతే స్థాయిలో ప్రతివ్యూహాన్ని ముద్రగడ సిద్దం చేసుకున్నారు. కనుకనే దీక్ష విరమించిన కొద్దిరోజులనుంచే మళ్లీ విమర్శలు ఎత్తుకున్నారు. ఇప్పుడు కూడా పోలీసు స్టేషన్కు వెళ్లి ఒత్తిడి చేసి మరీ అరెస్టయ్యారు.ఇకపై కాపుల ఆందోళన ఏ రూపంలో వుంటుందో తెలియదు గాని ముద్రగడ మాత్రం ప్రతిజిల్లాలో కాపుసేన ఏర్పాటు చేయనున్నట్టు ఏలూరులో ప్రకటించి వున్నారు. అరెస్టుల అనంతరం ఆయన శిబిరంకూడా మరింత తీవ్రత పెంచేందుకు ప్రయత్నించవచ్చు.
ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష విధ్వంసానికి దారితీస్తుందని ఇంటలిజెన్స్ వర్గాల దగ్గర సమాచారం వుంది. ఆ మేరకు వారు హెచ్చరికలు కూడా అందచేశారు. అయినా రాజకీయ కారణాల వల్లనో లేక ప్రతిక్రియ ఎక్కువగా వుంటుందనే సంకోచంతోనో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. రైలుబోగీల ధగ్ధం తర్వాత ముఖ్యమంత్రి సహా నాయకులందరూ వైసీపీపై దాడి కేంద్రీకరించారు.మరోవైపున తమలోని కొందరు కాపు నేతలను ఆయన దగ్గరకు పంపించి ఎలాగో దీక్ష విరమింపచేశారు. అప్పటినుంచి తెలుగుదేశం నేతలు కొన్ని పేర్లు చెబుతున్నారు. వారిలో ఒక వైసీపీ నాయకుడు నాకు విమానాశ్రయంలో కనిపించినప్పుడు మాటవరుసకు దీన్ని ప్రస్తావిస్తే ఆగ్రహౌదగ్రులైనారు. ఆ తరుణంలో తన పక్కన తెలుగుదేశం ప్రతినిధి వుండటం గురించి కూడా నేను అప్పుడు 360లో రాశాను. ఇదంతా పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం అన్నది వైసీపీ తీసిపారేసింది.
దీక్షతోనే గాక తన వ్యాఖ్యలతోనూ తీవ్రమైన సంచలనం కలిగించిన ముద్రగడ చప్పున దీక్ష విరమించడమే గాక చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పడం ఆయన అనుయాయులకూ వైసీపీ నేతలకూ కూడా మింగుడు పడలేదు. దాన్నిసరిచేసుకోవడానికే ఆయన కొద్దిరోజుల్లోనే మళ్లీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు మొదలుపెట్టారు.
అందుకు తగినట్టే తెలుగుదేశం నాయకత్వం కూడా సమాధానాలు ఇప్పించింది. మహానాడులోనూ రాజకీయంగా ఖండించింది. ఇప్పుడు నిందితులను అరెస్టు చేశారు. అంటే నెమ్మదిగా వేడిపెంచుతున్నారన్నమాట. ఈ క్రమంలో కులాల కుంపట్లు మరోసారి చర్యలకు ఎవరు కారకులైనా ప్రజలు హర్షించరు. ఇప్పటికే విభజనసమస్యల నుంచిబయిటపడని ఆంధ్ర ప్రదేశ్లో వివాదాలు విద్వేషాలు పెరిగితే మరింత నష్టం. ఈ విషయంలో ప్రభుత్వం కాపునేతలు కూడా సంయమనంతో వ్యవహరించాలనే ప్రజలు కోరుకుంటారు. రిజర్వేషన్ల విస్తరణ అంత సులభంగా కోర్టుల ఆమోదం పొందబోదని గుజరాత్ పటేళ్లు హర్యానా జాట్ల ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. కోర్టులు దాన్ని కొట్టి వేసిన తర్వాత ఆ కులాలు కొత్తగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.హర్యానాలోనూ జాట్ల రిజర్వేషన్ల కు కోర్టు అవాంతరంతర్వాత ఆందోళనను పున: ప్రారంభించొని ే గతసారి వచ్చిన స్పందన ఇప్పుడు రాలేదని పరిశీలకులఅంచనా. కాపునాయకులు ఇవన్నీ గమనంలో వుంచుకోవాలి. ప్రభుత్వం కూడా సంయమనం పాటించాలి తప్ప దీన్ని రాజకీయ సామాజిక ఘర్షణగా మారనివ్వకూడదు.