విడుదలకు ముందు పుష్ప చాలా రకాలుగా ఆకర్షించింది. ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ చూడాల్సిందే అనే ఉత్సుకతని పెంచింది. అందులో.. సమంత ఐటెమ్ సాంగ్ ఓ బలమైన కారణం. పుష్పలో సమంత ఐటెమ్ సాంగ్ చేస్తోందనగానే ఆసక్తి మొదలైపోయింది. ఎందుకంటే.. సమంత అప్పటి వరకూ ఐటెమ్ గీతం చేయలేదు. అందుకే భలే క్రేజ్ వచ్చింది. సమంత స్థానంలో తమన్నా, పూజా హెగ్డేలాంటి వాళ్లుంటే… ఈ పాట గురించి జనం అంతగా మాట్లాడుకునేవాళ్లు కాదేమో. ఎందుకంటే.. తమన్నా, పూజాలనే ఐటెమ్ గాళ్స్ గా చూసేశారు. మరి ఈ పాటలో సమంత ఎలా కనిపించబోతోంది? ఎన్ని హొయలు ఒలికించబోతోంది? అనే దిశగా ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. పైగా ఇది మగాళ్ల మనోభావాల్ని టార్గెట్ చేసిన పాట. దాంతో.. ఆ రచ్చ కాస్త ఇంకో టర్న్ తీసుకుంది.
తీరా పుష్ప విడుదలైంది. ఇందులో సమంత పాట పెద్దగా ఆనలేదు. విడుదలకు ముందు ఉన్న బజ్.. ఈ పాట చూస్తున్నప్పుడు రాలేదు. అంతెందుకు… అసలు సమంతకి సరిగా ఫోకస్ చేయలేదంటూ.. గుంపులో గోవిందమ్మలా సమంత మారిపోయిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈమాత్రం పాటకు సమంతనే తీసుకోవాలా? అని అడుగుతున్నారంతా. సో.. సమంత ఈ సినిమాకి ప్లస్ అవ్వలేదు. ఈ పాట వల్ల సమంతకీ ప్లస్ అవ్వలేదు. పైగా.. ఐటెమ్ పాటలో నటించడానికి ఒప్పించేందుకు సుకుమార్ నానా పాట్లూ పడ్డాడట. ఈ పాటలో చేయడానికి సమంత ససేమీరా అందని, సమంతని ఒప్పించడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంటే ఈ పాట చేయడానికి సమంత అన్యమస్కంగానే ఒప్పుకుంది. ఈ రిజల్ట్ బట్టి చూస్తే… సమంత కెరీర్లో ఇదే తొలి, చివరి ఐటెమ్ పాటగా మిగిలిపోయే ఛాన్సుంది.