ఆంధ్రప్రదేశ్‌లో పునర్వైభవం పొందేందుకు.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో కనీసం ఉనికి చాటాలన్న బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి దూరంగా ఉంటూ, ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉన్న నాయకులను తిరిగి కాంగ్రెస్‌గూటికి చేరేలా చేయాలని కొత్తగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన ఉమెన్ చాందీ నిర్ణయించారు. దీని కోసం కసరత్తు ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 13వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన ఇప్పటికే తనతో పాటు మళ్లీ పార్టీలో చేరాలంటూ.. తనతో సన్నిహితంగా వ్యవహరించిన నేతలకు ఫోన్లు చేస్తున్నారు.
అప్పట్లో కాంగ్రెస్ లో క్రీయాశీలక పాత్ర పోషించిన ఉండవల్లి, లగడపాటి వంటి వారితో కూడా ఉమెన్ చాందీ సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. నాడు కాంగ్రెస్‌వాదులుగా ఉండి, నేడు తటస్థంగా ఉన్న 1000 మందిని ఇప్పటికే లిస్టవుట్ చేశారు. వీరందరితో వన్ బై వన్ చర్చలు జరుపుతున్నారు. వీరిలో చాలా మంది ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో.. ఉమెన్ చాందీ స్వయంగా రంగంలోకి దిగి నేతలతో మాట్లాడుతున్నారు. భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోవాలని ఆహ్వానిస్తున్నారు
కేంద్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల్ని కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ బలోపేతం కోసం వాడుకోవాలని అనుకుంటోంది. వచ్చే ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాకపోయినా.. ప్రాంతీయ పార్టీల మద్దతుతు అయినా అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతూండటంతో.. నేతలు కూడా.. పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారన్న అంచనాలున్నాయి. కానీ ఎన్నికలకు దగ్గరకు వస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో ఉన్న కొద్ది పాటి పొటెన్షియల్ లీడర్లు కూడా.. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే.. ప్రధాన పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరాల్సిందేన్న అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ కోలుకోవడం సంగతి తర్వాత.. కిరణ్ చేరికతో వచ్చే మైలేజీ కూడా పోతుంది.